మత రాజకీయాలు దేశ ఐక్యతకు ప్రమాదం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
పాలకుల మత రాజకీయాల ప్రోత్సాహం దేశ ఐక్యతకు పెను ప్రమాదం అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పసర  పి ఎస్ ఆర్ గార్డెన్ లో మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు కార్యక్రమం మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండారి రవికుమార్ హాజరై మాట్లాడారు.మతం దేవుడు పూర్తిగా వ్యక్తిగతమైనవని దేశ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు మతం కులం దేవుళ్లను వాడుకొని దేశ సమైక్యత సమగ్రతలకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఇలాంటి మత రాజకీయాలను భారతీయులందరూ తిరస్కరించాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన సూపర్ పవర్ దేశాలుగా చెప్పబడుతున్న ఏ దేశమైనా మతరాజ్యం కాదని అవన్నీ సెక్యులర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న దేశాలని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అంతర్యుద్ధాలు మతకలహాలు లేని శాంతియుత దేశంగా ఉండాలని ఆయన అన్నారు. బిజెపి ఎంఐఎం లాంటి మతత్వ రాజకీయ పార్టీలను ప్రజలు తిప్పి కొట్టారని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో తునికాకు కార్మికులకు 2015 నుండి రావాల్సిన బోనస్ విడుదలైనప్పటికీ అటవీశాఖ అధికారులు ప్రజలకు దక్కవలసిన రెక్కల కష్టాన్ని స్వాహా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తునికాకు బోనస్ చివరి పైసా చెల్లించేంతవరకు ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో 93 ఎకరాలకు పోడు రైతులు దరఖాస్తులు చేసుకుంటే కేవలం 18 ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పుడు రైతులకు అండగా సిపిఎం పార్టీ ఉన్నదని భవిష్యత్తులో చివరి ఎకరం భూమి  పట్టా ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బిరెడ్డి సాంబశివ జిల్లా కమిటీ సభ్యులు పొదిల చిట్టిబాబు గొంది రాజేష్  చిరంజీవి నాయకులు గుండు రామస్వామి కోట కృష్ణారావు సామ చంద్రారెడ్డి కడారి నాగరాజు అంబాల పోషాలు  పురుషోత్తం ఆదిరెడ్డి ఉపేంద్ర చారి రమేష్ బ్రహ్మచారి రజిత కవిత రాజేష్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.