– పండితులకు పదోన్నతులు కల్పించాలి : విద్యాశాఖ సంచాలకులకు ఆర్‌యూపీపీటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అప్‌గ్రెడేషన్ పోస్టుల పదోన్నతుల తర్వాత రాష్ట్రంలో మిగిలిన లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ) పోస్టులను కూడా స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఆర్‌యూపీపీటీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మిగిలిపోయిన పండితులకు కూడా పదోన్నతులు కల్పించాలని సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహరెడ్డిని శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు, కోశాధికారి కట్టా గిరిజారమణశర్మ కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎనిమిది వేలకుపైగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషాపండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో తొమ్మిది మంది తెలుగు పండితులు ఉంటే 21 పోస్టులు అప్‌గ్రేడ్ అయ్యాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల యాజమాన్యంలో 138 పోస్టులకుగాను 118 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారని వివరించారు. దీనివల్ల 2003 డీఎస్సీ భాషాపండితులు పూర్తి పదోన్నతులు పొందకుండా మిగిలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ భాషాపండితులకు న్యాయం చేయాలని కోరారు.