భూపోరాట నేతలకు రిమాండ్‌

Remand for land struggle leaders– జగిత్యాలలో సీపీఐ(ఎం) నాయకులపై కేసులు
– ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారని ఆరోపణ
– అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై దాడి చేశారని కేసులు నమోదు
– జత చేసిన పాత కేసులు
– గుడిసెలు తొలగించిన రెవెన్యూ, పోలీసు అధికారులు
– అరెస్టులతో భయపడేది లేదు.. పోరాటాన్ని ఆపబోం: సీపీఐ(ఎం)
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / జగిత్యాల టౌన్‌
జగిత్యాల జిల్లా కేంద్రం శివారులోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదల పక్షాన పోరాడుతున్న సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై దాడికి దిగారని, అందుకు ప్రోత్సహించారన్న పేరుతో గతంలో ఉన్న కేసులనూ జత చేస్తూ పార్టీ నాయకులతో కలిపి 9 మందిని రిమాండ్‌కు తరలించారు. పేదల గుడిసెలను రెవెన్యూ, పోలీసు సిబ్బంది తొలగించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో మొదలైన పేదల భూపోరాటం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కేంద్ర శివారులోని టీఆర్‌నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేలాది మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. మూన్నెళ్లుగా అక్కడే ఉంటున్నారు. గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు అందించాలని పోరాడుతున్నారు. పలు రూపాల్లో నిరసనలూ తెలిపారు. గత నెల 18న వేలాది మంది పేదలు కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి.. తమ అర్జీలను ఆర్డీఓ కార్యాలయంలో అందించారు. ఇక అప్పటి నుంచి సదరు ప్రభుత్వ భూముల్లో మిగిలిన స్థలంలోనూ మరికొందరు పేదలు గుడిసెలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు దాన్ని అడ్డగించారు. ఇదే అదనుగా పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు రంగప్రవేశం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని, అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ పేదల పోరాటానికి అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకులను సంక్రాంతి మర్నాడు మంగళవారం అకస్మాత్తుగా పోలీసులు అరెస్టు చేశారు. 24 మందిపై కేసులు నమోదు చేయగా.. అందులో 9 మందిపై 307 సహా గతంలో కోరుట్లలోనూ నమోదైన కేసులను జత చేశారు. ఆ 9 మందిని రిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ జైలుకు పంపించారు. రిమాండ్‌ అయిన నాయకుల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు లెల్లల బాలకృష్ణ, పార్టీ జిల్లా కన్వీనర్‌ గుగులోతు తిరుపతి నాయక్‌, నాయకులు కడకుంట్ల నాగరాజు, గర్వందుల రమేష్‌, ఇందూరు సులోచన, ఎల్ల పోచన్న, కుంచేపు శంకర్‌, పిట్టల హేమలత, రజియా సుల్తానా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణవెంకట్‌రెడ్డి ఘటనాస్థలానికి వెళ్లారు. పేదల పక్షాన పోరాడుతున్న నాయకులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి అరెస్టులకు, బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని, పేదలకు ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేవరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.