ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలనేది సామెత. ఇప్పుడు ఈ సామెత ‘కారు…సారు’ పార్టోళ్లకు బాగా అతికినట్టు ఉంటుంది. ఎందుకంటే, తెలంగాణ ప్రజల్లో గూడుకుట్టుకుని ఉన్న ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో కారు రరున పదేండ్లు పరుగెత్తింది. ఆ సమయంలో స్పీడ్ బ్రేకులు కూడా చూసుకోలేదు. బండిని స్లో చేయలేదు. ఎన్నో ఆక్సిడెంట్లు చేసింది. రాంగ్రూట్లో వెళ్లిన కారు బయటకు రాకుండా నేరుగా సర్వీసింగ్‌కు వెళ్లింది. అప్పుడు గానీ గుర్తుకు లేదు. ప్రజలు, వారి బాధలు, కష్టాలు, కన్నీళ్లు…. కారు సర్వీసుకు పోయిన తర్వాత ఆటోలు, బస్సుల్లో తిరుగుతూ ప్రజల దగ్గరకు వెళుతున్నారు నాయకులు. వరిపొలాల్లో తిరుగుతూ ఎండిపోయిన పొలాలను పరిశీలిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టపరిహారమివ్వలేదు. రైతులకు సంకెళ్లు వేశారు. చంటిపిల్ల తల్లులను కూడా జైళ్లకు పంపించారు. రైతుబంధు ఇస్తున్నామనే పేరుతో రైతులను పురుగుల్లా చూసింది. గడీలకు గడియ లోపల రాజబోగాలు అనుభవిస్తూ… ఎవర్ని లోపలకు రాన్వికుండా చేసితిరి. ప్రజలను కలవకపోతిరి. అధికార మత్తు దిగగానే అన్ని గుర్తుకొస్తున్నాయి మన కారు పార్టీ నేతలకు. ప్రజల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే…
– గుడిగ రఘు