మార్షల్‌ లా రోజులు గుర్తుకొస్తున్నాయి

Martial law days Remembering– స్వతంత్ర మీడియాపై ఆగని కక్షసాధింపు చర్యలు
”ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ లేదు. మార్షల్‌ లా కూడా అమలులో లేదు. అయినప్పటికీ స్వతంత్ర మీడియాపై యధేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదనే నానుడి అపహాస్యం పాలవుతోంది” మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ ఎస్‌ఓడీగా పనిచేసిన ఎన్‌ఎన్‌. సాహూ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ దేశవర్తమానానికి అర్థం పడుతున్నాయి.
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ పైన, అందులో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన సిబ్బంది, ఉద్యోగుల నివాసాల పైన జరిగిన దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. దేశవ్యాప్తంగా యాభై మంది పాత్రికేయులు సహా సుమారు ఎనభై మంది వ్యక్తుల నివాసాలపై జరిగిన దాడులను బహుశా స్వతంత్ర భారతదేశంలో ఓ మీడియా సంస్థపై జరిగిన అతి పెద్ద దాడిగా చెప్పవచ్చు. పాత్రికేయులపై క్రూరమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడమంటే స్వతంత్ర జర్నలిజాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టడమే అవుతుంది. రెండు రోజుల పాటు న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ కార్యాలయాన్ని మూసివేయడంతో దాని రోజువారీ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే జలియన్‌వాలా బాగ్‌ ఊచకోత తర్వాత పంజాబ్‌లో మార్షల్‌ లా విధించి అనేక వార్తా పత్రికల సంపాదకులను అరెస్ట్‌ చేసి విచారించిన ఉదంతం గుర్తుకు వస్తోంది. వాస్తవానికి 2021 నుండీ న్యూస్‌క్లిక్‌తో సంబంధమున్న అనేక మందిపై ఈడీ దాడులు చేస్తూనే ఉంది. పోర్టల్‌ వ్యవస్థాప కుడు ప్రబీర్‌ పుర్కాయస్థ నివాసంపై కూడా వారం రోజులు దాడులు చేశారు. ఈ వ్యవహారం లో పోలీసులు ఇంకా ఛార్జిషీటు దాఖలు చేయలేదు. పుర్కాయస్థ, ఇతరులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఢిల్లీ హైకోర్టు వారికి రక్షణ కల్పించడం ఊరట కలిగించే విషయం.
1919లో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన ఊచకోత ఘటన తర్వాత పంజాబ్‌లో మార్షల్‌ లా (యుద్ధ చట్టం) విధించారు. అప్పుడు ట్రిబ్యూన్‌ పత్రిక ట్రస్టీగా వ్యవహరించిన ఓ న్యాయవాదిని వారంట్‌ లేకుండానే అరెస్ట్‌ చేశారు. ఏ ఆరోపణపై అరెస్టు చేస్తున్నదీ చెప్పలేదు. ఇప్పుడు పుర్కాయస్థ, అమిత్‌ చక్రవరిని కూడా వారంట్‌ చూపకుండానే అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ కస్టడీకి (ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీ) ఎందుకు పంపింది కూడా తెలియజేయలేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ సైతం ఇవ్వలేదు. కోర్టును ఆశ్రయించిన తర్వాతే వారికి ఆ కాపీ అందింది.
1919 నుండీ అదే కథ
దేశానికి ద్రోహం తలపెట్టే రాతలు రాస్తున్నారంటూ 1919లో ట్రిబ్యూన్‌ సంపాదకుడు కాళీనాథ్‌ రారుని అరెస్ట్‌ చేసి, విచారించి, శిక్ష విధించారు. అయితే ఆయన రాతల్లో అలాంటిదేమీ కన్పించలేదు. అప్పుడే ప్రారంభించిన ప్రతాప్‌ అనే పత్రిక సంపాదకుడిపై కూడా ఇలాంటి క్రూరమైన చర్యలే తీసుకున్నారు. మార్షల్‌ లా కాలంలో స్వతంత్ర జర్నలిజం మనుగడకే చోటు లేకుండా పోయింది. ట్రిబ్యూన్‌, పంజాబీ, ప్రతాప్‌ పత్రికలు విధిలేని పరిస్థితుల్లో ప్రచురణలు నిలిపివేశాయి. గతంలో కూడా దైనిక్‌ భాస్కర్‌ వంటి పత్రికలు, ది వైర్‌, న్యూస్‌లాండ్రీ, కారవాన్‌ వంటి వార్తా సంస్థలు పోలీసు చర్యకు గురయ్యాయి. నిబంధనలు, విలువలకు కట్టుబడి కార్యకలాపాలు సాగించినప్పటికీ వాటిపై తీవ్రమైన కక్షపూరిత చర్యలు ఆగలేదు.