ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో రిమోట్‌

Remote in the hands of RSS– ప్రజలకు మోడీ ఆర్థిక విధానాలు వివరించండి : కేంద్ర మంత్రులకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల దిశానిర్దేశం
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ నడుపుతున్నా… రిమోట్‌ కంట్రోల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఉన్నదని స్పష్టమవుతోంది. ఎన్నికలు మొదలుకుని కేంద్రప్రభుత్వ తీరు తెన్నుల వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించేదే జరుగుతోంది.కేంద్రమంత్రులు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ముందు మోకరిల్లక తప్పటంలేదని తాజా పరిణామాలు సైతం రుజువు చేస్తున్నాయి.
ఏం జరిగిందంటే…
ఐదు రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని కీలక మంత్రులతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఆర్థిక, ఇతర రంగాలలో మోడీ అవలంబిస్తున్న విధానాలను గురించి ఓటర్లకు ఏ విధంగా వివరించాలన్న విషయంపై చర్చించింది. రెండు రోజుల క్రితం సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్‌ షా, కార్మిక మంత్రి భూపేందర్‌ యాదవ్‌, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, బీజేపీ మంత్రుల మధ్య జరిగిన సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై సవివరంగా చర్చించారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ దసరా పండుగ సందర్భంగా ప్రసంగిస్తూ ‘స్వదేశీ’పై మాట్లాడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నదని ఆయన చెప్పారు.
భగవత్‌ తన ప్రసంగంలో స్వావలంబన గురించి ప్రస్తావించారు. ‘స్వదేశీ’ పైనే ఆధారపడాలని, అనవసర వ్యయాన్ని ఆపేయాలని ఆయన సూచించారు. దేశంలో ఉద్యోగావకాశాలను పెంచాలని, దేశంలోని పెట్టుబడులను దేశంలోనే ఉపయోగించాలని, వాటిని దేశ ప్రయోజనాల కోసమే వినియోగించాలని ఉద్బోధించారు. కాగా మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్ర స్థాయికి తీసికెళ్లే విషయంపై సమావేశంలో చర్చించారని బీజేపీ నాయకుడు చెప్పారు. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు బాగా తెలుసు. అవి బాగానే అమలవుతున్నాయి. అయితే మోడీ హయాంలో దేశం సాధించిన ఆర్థికాభివృద్ధిపై మరింత దృష్టి పెట్టి దానిని ప్రజలకు వివరించాల్సి ఉంది’ అని తెలిపారు.
ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ఏ విధంగా గాడిలో పెట్టారో ఓటర్లకు తెలియజేయాలని మంత్రులకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు సూచించారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు మోడీ ప్రభుత్వ విధానాలను గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్దిదారుల చెంతకు చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. సంఫ్‌ు అనుబంధ సంస్థలైన భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, లఘు ఉద్యోగ్‌ భారతి నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.