– ప్రభుత్వ టీవీలోనూ కన్పించని కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: సస్పెన్షన్‌ను ఎత్తివేసిన అనంతరం బుధవారం లోక్‌సభలో అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుండి తొలగించారు. మరోవైపు రాహుల్ ప్రసంగిస్తుండగా ప్రభుత్వ టీవీ ఛానల్ సంసద్ ఆయనను చూపలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. మణిపూర్ హింసపై మోడీ మౌనాన్ని రాహుల్ తన ప్రసంగంలో తప్పుపట్టారు. మోడీ దేశ వ్యతిరేకి అని, మణిపూర్‌లో భరతమాతను చంపేశారని మండిపడ్డారు. అయితే బుధవారం రాత్రి లోక్‌సభ రికార్డులను పరిశీలించగా రాహుల్ ప్రసంగంలోని కొన్ని భాగాలు కన్పించలేదు. మొత్తంగా 24 పదాలను తొలగించారు. ఇందులో రెండు ప్రస్తావనలు స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించినవి. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరును కూడా రాహుల్ ప్రస్తావించారు. ‘నేను అదానీ గురించి మాట్లాడితే మీ సీనియర్ నాయకుడికి అగ్రహం వచ్చి ఉంటుంది. ఆయన కోపం మీ మీద కూడా ప్రభావం చూపుతుంది’ అని స్పీకర్‌ను ఉద్దేశించి రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుండి తొలగించారు. అంతేకాక మణిపూర్‌లో మోడీ భరతమాతను హత్య చేశారంటూ చేసిన వ్యాఖ్యలలో కూడా ‘హత్య’ అనే పదాన్ని తొలగించారు. దీనితో పాటు దేశద్రోహి, హంతకుడు, హత్య అనే పదాలనూ తొలగించారు.
ప్రతిపక్ష నేతలను కూడా…
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఇండియా కూటమి సభ్యులు మాట్లాడుతుంటే సంసద్ టీవీ వారిని చూపించలేదని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. చాలా సందర్భాలలో స్పీకర్ స్థానాన్ని మాత్రమే చూపించారని తెలిపారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు మాట్లాడేటప్పుడు మాత్రం కెమేరాలను వారి వైపే తిప్పి ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగంలో 40% కంటే తక్కువగానే సంసద్ టీవీ చూపిందని కాంగ్రెస్ ఎంపీ జై రాం రమేష్ ట్వీట్ చేశారు. రాహుల్ 37 నిమిషాల పాటు ప్రసంగిస్తే కేవలం 14 నిమిషాల 37 సెకన్లు మాత్రమే టీవీలో ఆయనను చూపించారని తెలిపారు. డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రసంగించే సమయంలో కూడా టీవీలో సభాపతినే చూపించారు. అయితే సభాపతి స్థానంలో ఉన్న కిరిత్ ప్రేమ్‌భారు సోలంకి ప్రతిపక్షాల ఆరోపణను తోసిపుచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా ప్రసంగించేటప్పుడు కూడా ఆయన్ని చూపకుండా స్పీకర్ స్థానంలో కూర్చున్న రమాదేవిని చూపించారు.