అక్రమ కేసులను ఎత్తేయండి

–  డీజీపీ అంజనీకుమార్‌కు సీపీఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్‌ను బుధవారం హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఈటి నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య కలిసి వినతిపత్రం సమర్పించారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, కుంట్లూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 215 నుంచి 224 వరకు సుమారు వందెకరాల భూదాన భూమిలో 10 వేల మంది నిరుపేద కుటుంబాల ప్రజలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారని తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రైవేట్‌ భూకబ్జాదారులతో కుమ్మక్కై ఆ గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దాన్ని అడ్డుకుని గుడిసెవాసులకు అండగా నిలుస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, నాయకులు ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు, పామిడి శేఖర్‌రెడ్డి, పబ్బతి లక్ష్మణ్‌, హరిసింగ్‌ నాయక్‌తోసహా 21 మందిపై హయత్‌ నగర్‌ పోలీసులు అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఆ కేసులను వెంటనే ఎత్తేయాలని కోరారు. భూదాన భూమిపై పూర్వాపరాలు పరిశీలించి ప్రస్తుతం నివాసముంటున్న 10 వేల కుటుంబాల ప్రజల గుడిసెలను తొలగించకుండా చూడాలని తెలిపారు. అక్రమ కేసులు బనాయించకుండా ఆదేశించి, పేదలకు న్యాయం చేయాలని డీజీపీని వారు కోరారు. వందెకరాల భూదాన భూమిలో గుడిసెలు వేసుకున్న ప్రజలకు వెంటనే పట్టాలిచ్చి, భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను డిమాండ్‌ చేశారు.