తమిళనాడు గవర్నర్‌ను తొలగించండి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రివర్గం నుంచి మంత్రి సెంథిల్‌ బాలాజీని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి తొలగించడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. గవర్నర్‌ పదవి నుంచి ఆర్‌ ఎన్‌ రవిని వెంటనే వెనక్కి పిలవాలని భారత రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రులను నియమించే లేదా తొలగించే హక్కు గవర్నర్‌కు లేదని, ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పొలిట్‌బ్యూరో తెలిపింది. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో జోక్యం చేసుకునే విధంగా ఆర్‌ఎన్‌ రవి వరుసగా చర్యలకు
దిగుతున్నారని, తాజాగా ఒక మంత్రిని తొలగించిన దారుణమైన చర్య రవి రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ పదవిని నిర్వహించడానికి తగినవాడు కాదని స్పష్టంగా తెలియజేస్తుందని పొలిట్‌ బ్యూరో తన ప్రకటనలో పేర్కొంది. రవిని తక్షణమే భారత రాష్ట్రపతి రీకాల్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది.