ఐఎంఎఫ్‌తో తిరిగి చర్చలు

– శ్రీలంక కొత్త అధ్యక్షుడు దిసనాయకె వెల్లడి
కొలంబో: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అత్యంత దుర్భరమైన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ, విదేశీ రుణదాతలతో చర్చలు తిరిగి ప్రారంభిస్తామని శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె తెలిపారు. సాధ్యమైనంత త్వరగా చర్చల ప్రక్రియను పూర్తి చేసి, నిధులు తీసుకువస్తామని చెప్పారు. గతంలో మాజీ అధ్యక్షుడు రణీల్‌ విక్రమసింఘె రూపొందించిన ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళిక భవితవ్యం దిసనాయకె తాజా విజయంతో చిక్కుల్లో పడింది. ఐఎంఎఫ్‌తో బెయిలవుట్‌ ఒప్పందంపై తిరిగి చర్చలు జరుపుతామని దిసనాయకె తన ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే పొదుపు చర్యలు పేదలు భరించే విధంగా వుండాలనుకుంటున్నామని చెప్పారు. 2022లో దివాలా తీసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 8300కోట్ల డాలర్ల దేశీయ, విదేశీ రుణాల చెల్లింపులను నిలిపివేసింది. తీవ్ర విదేశీ మారక ద్రవ్య సంక్షోభం నెలకొంది. దీనివల్ల నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.