2,255 మంది కాంట్రాక్టు, అతిథి అధ్యాపకుల పునరుద్ధరణ

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసిన కాంట్రాక్టు, మినిమం టైంస్కేల్‌, పార్ట్‌టైం, గెస్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ లెక్చరర్లను ప్రస్తుత విద్యాసంవత్సరం (2023-24)లోనూ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అవసరాల మేరకు 2,255 మందిని పునరుద్ధరించాలని నిర్ణయించామని తెలిపారు. వారిలో 449 మంది కాంట్రాక్టు, ముగ్గురు మినిమం టైంస్కేల్‌, 97 మంది పార్ట్‌టైం, 1,654 మంది అతిథి అధ్యాపకులు, 52 మంది ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన లెక్చరర్లను తీసుకోవడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
టీజీజేఎల్‌ఏ-475 హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులు, వివిధ కేటగిరిలో పనిచేసే అధ్యాపకుల కొనసాగింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టీజీజేఎల్‌-475) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ హర్షం వ్యక్తం చేశారు. జీవో నెంబర్‌ 1145 ద్వారా వివిధ కేటగిరిల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల్లో అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం కొనసాగింపునకు ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఇంటర్‌ విద్యా కమిషనరేట్‌ వెంటనే దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌ ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టులలో అధ్యాపకులను కొనసాగించాలని కోరారు. ఈ ఉత్వర్వులు విడుదల చేయడం పట్ల గెస్ట్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్‌ హర్షం ప్రకటించారు.