ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేక ఆగిన రుణాల రెన్యూవల్స్‌

ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేక ఆగిన రుణాల రెన్యూవల్స్‌– ఇబ్బందులు పడుతున్న రైతులు
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కొల్చారం
మండలంలోని రంగంపేటలో ఉన్న ఎస్‌ బీఐ బ్యాంకులో గత కొన్ని నెలలుగా ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేక రుణాల రెన్యూవల్‌ చేయలేక కొత్త రుణాలు పొందలేక రైతులు సతమతమవుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ ప్రక్రియలో భాగంగా కొంత మంది రైతుల రుణాలు గతంలో రెన్యూవల్‌ చేయగా మరికొంత మంది రైతులు అవగాహన లోపంతో రెన్యూవల్‌ చేయలేకపోయారు. అయితే రుణమాఫీకి అర్హులై రెన్యూవల్‌ చేసిన రైతులకు వెంటనే కొత్త రుణాలు మంజూరు కాగా రెన్యూవల్‌ చేయలేని రైతులకు రుణాలు మంజూరు కాకపోవడంతో నిరాశ కలిగిస్తోంది. దీంతో సకాలంలో రుణాలు అందక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నెల రోజులు గడిచినా బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేకపోవడం గమనార్హం. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ కి అర్హులైన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రంగంపేట ఎస్‌ బీఐ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ ను నియమించాలని పలువురు రైతులు కోరుతున్నారు.