దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు మరమ్మతులు

– పీఆర్‌ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క చెప్పారు. సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ నిధులను ఉపయోగించి గ్రామీణా రహదారుల అభివద్ధి కోసం కషి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖపై డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష చేశారు. ఈసందర్భంగా గ్రామీణ రహదారులు, వాటి పరిస్థితిపై ఆరా తీశారు. మరమ్మతులు, నిధులు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. పంచాయతీలు, స్థానిక సంస్థలలో వివిధ అభివద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మౌలిక సదుపాయాల కోసం కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. పెండింగ్‌ పనుల్లో నాణ్యత పెంచేలా త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.