మేడిగడ్డకు మరమ్మతులు వృథానే !

to Madigadda Repairs are wasted!– ఎన్‌డీఎస్‌ఏ నివేదిక స్పష్టీకరణ
– దెబ్బతినకుండా ఉంటుందని చెప్పలేం
– 2019 జూన్‌లోనే బ్యారేజీకి నష్టం
– వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలి
– పరీక్షలు చేసి, మరమ్మత్తులకు పూనుకోవాలి
– దీనికి బాధ్యత డ్యామ్‌ ఓనర్‌ (సీఈ రామగుండం)దే: బ్యారేజీల మరమ్మతులపై బాంబు పేల్చిన ఎన్‌డీఎస్‌ఏ
– రూ.లక్ష కోట్ల ప్రజాధనం గంగపాలేనా ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతులు చేసినా దెబ్బతినకుండా ఉంటుందనే నమ్మకం లేదనీ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) బాంబు పేల్చింది. యథాతథస్థితిని కొనసాగించడానికి మాత్రమే మరమ్మత్తులు ఉపకరిస్తాయనీ, బ్యారేజీ మరింత దెబ్బతినకుండా మరమ్మతులు తప్పనిసరి అని తేల్చిచెప్పింది. లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక రావడం బీఆర్‌ఎస్‌కు శాపం కానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక గత చరిత్ర కానుందా ? అనే అనుమానాలు ఈ నివేదికతో స్పష్టమవుతున్నది. ఈ నివేదికను బీఆర్‌ఎస్‌కు ఖేదాన్ని మిగిల్చగా, కాంగ్రెస్‌ ఇతర పార్టీలకు మోదాన్ని అందించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్‌(ఈఆర్టీ), గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌(జీపీఆర్‌) పరీక్షలతోపాటు బ్యారేజీ స్థితిగతులు, నిర్మాణ ఏజెన్సీలు, అధికారుల నివేదికలు, డిజైన్లు, డ్రాయింగులు పరిశీలించి, నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులందరినీ విచారించిన అనంతరం ఎన్డీఎస్‌ఏ బ్యారేజీల పునరుద్ధరణ సంబంధించిన మధ్యంతర నివేదికను రాష్ట్ర సాగునీటిపారుదల శాఖకు ఈనెల ఒకటిన నివేదిక ఇచ్చింది. వానాకాలంలోపు బ్యారేజీల వైఫల్యంపై జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ (జీపీఐ), జియో సాంకేతిక పరీక్షల అనంతరం డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేసి, మరమ్మతులకు పూనుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎన్‌ఏ) చైర్మెన్‌ అనిల్‌ జైన్‌ మధ్యంతర నివేదిక మంగళవారం లీక్‌ కావడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 జూన్‌లో మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించగా మొదటి వరదల అనంతరం 2019 నవంబరులో గేట్లు మూసివేయగా, బ్యారేజీ దిగువ భాగంలో సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు (సీసీ బ్లాకులు), ఏప్రాన్‌ దెబ్బతిన్నట్టు గుర్తించడం జరిగిందని అన్నారు. అయితే మరమ్మతులతోపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) పనులు చేయకుండా బ్యారేజీని వినియోగించడంతో 2023 అక్టోబరు 21వ తేదీన బ్యారేజీ కుంగిపోయిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్‌ నెం.16 నుంచి 21 దాకా ఆయా స్థాయిల్లో కుంగిపోయి, దెబ్బతిన్నాయని వివరించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ ఏప్రాన్లు దెబ్బతిన్నాయనీ, సీసీబ్లాకులు చెల్లాచెదురు అయ్యాయని గుర్తు చేసింది. అన్నారం బ్యారేజీతో పాటు గేట్ల వద్ద ఇసుక మేటలు వేస్తుండటంతో నీటి పారుదల శాఖ నిరంతరం వీటిని తొలగించి, వరద సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది. వానాకాలంలోపు బ్యారేజీలకు తగిన పరీక్షలు చేసి, మరమ్మత్తులు చేయాల్సిన బాధ్యత డ్యామ్‌ సేఫ్టీ చట్టం -2023 ప్రకారం డ్యామ్‌ ఓనర్‌(రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌)దేనని పేర్కొన్నది. ఈ సందర్భంగా బ్యారేజీల పునరుద్ధరణకు పలు సూచనలు చేసింది.
మరమ్మతులకు ఎన్‌డీఎస్‌ఏ సూచనలు
1. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా మరమ్మత్తులు చేయాలి. మరమ్మత్తులు యధాతథాస్థితిని కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. భవిష్యతులో ఏ పరిణామాలు చోటుచేసుకున్నా బ్యారేజీ దెబ్బతినకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు.
2. పగుళ్లును నిరంతరం వరిశీలించాలి. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో సీనీ బ్లాకులు ద్బెబతిన్నాయి.
3.పిల్లర్లు 16 నుంచి 22 దాకా పగుళ్లు వచ్చాయి. ఆ పిల్లర్లు మరింత దెబ్బతినకుండా వాటికి ఇనుప పట్టీలు వేయాలి.
4. రాఫ్ట్‌(పునాది)పై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
5. రాఫ్ట్‌ కింద ఉన్న ప్రెషర్‌ రిలీవ్‌ వాల్వ్‌ మరమ్మతులు చేయడం లేదా మార్చడం చేయాలి.
6. బ్లాకు-7 కుంగుబాటును నిరంతరం పరిశీలించడానికి వీలుగా టోటల్‌ స్టేషన్‌ను వినియోగించాలి. బ్లాక్‌-7 రాఫ్ట్‌ కిందకు ఇసుక చేరింది. దీనికోసం ఇసుక నింపిన బస్తాలతో పాటు సిమెంట్‌ బస్తాలను వరుస క్రమంలో పెట్టాలి.
7. బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సీకెంట్‌ పైల్‌ను పరిశీలించాలి. ప్లింత్‌ శ్లాబు కింద ఇన్వర్టర్డ్‌ ఫిల్డర్లపై ఉన్న కాంక్రీట్‌ బ్లాకులు దెబ్బతిన్నాయి. ప్లింత్‌ స్లాబులపై కింద ఉన్న ఫిల్డర్లనుంచి ఇసుక కొట్టుకుపోయిందా…? లేదా వరిశీలించాలి.
8. జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి, సీకెంట్‌ ఫైల్స్‌ దెబ్బతిన్న చోట షీట్‌ ఫైల్లు దించాలి. సీకెంట్‌ ఫైల్స్‌ ఎండ్‌నీల్‌ మధ్య సిమెంట్‌, ఇసుక మిశ్రమంతో గ్రౌటింగ్‌ చేయాలి.
9. సీకెంట్‌ ఫైల్స్‌ వైఫల్యంతో రాఫ్ట్‌ (పునాది) కింద భారీ రంధ్రాలు(బొరియలు) పడ్డాయి. వీటిని మూయడానికి రాఫ్ట్‌ 5 నుంచి 7 సెంటీమీటర్ల మేర రంధ్రాలు వేయాలి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ వేయరాదు. సిమెంట్‌, ఇసుక, నీళ్లతో గ్రౌటింగ్‌ చేయాలి. వాటిని గుర్తించడానికి బోర్‌ రంధ్రాల్లోకి కెమెరాలను పంపాలి. గ్రౌటింగ్‌ చేసే క్రమంలో రాఫ్ట్‌పై ఒత్తిడి, భారం పడకుండా చూసుకోవాలి.
10, వర్షాకాలంలో ఏడో బ్లాకు గేట్లన్నీ ఎత్తి ఉంచాలి. గేట్లు ఎత్తే క్రమంలో అన్ని గేట్లను సమగ్రంగా పరిశీలించాలి. వర్షాకాలంలో బ్యారేజీ గేట్లతో పాటు అన్ని కాంపోనెంట్లను తనిఖీచేయాలి. ప్రధానంగా ఏడో బ్లాకులోని 15 నుంచి 22 గేట్లు ఓపెన్‌ కావడం లేదు. దీనికోసం క్రేన్లను ఏడో బ్లాకుపై కాకుండా వేరే చోట పెట్టి, గేట్లను ఎత్తాలి. ఈ క్రమంలో పిల్లర్లకు ఇనుప పట్టీలను బిగించాలి.
11. పిల్లర్‌ నెంబర్‌ 20-21 మధ్య ఉన్న గేట్లను తొలగించాలి.
12. బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సీకెంట్‌ పైళ్లు, శ్లాబును కలిపే సీసీ బ్లాకులు, ప్లింత్‌ స్లాబులు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి కట్టాలి. ఈ క్రమంలో వాటి కింద ఉన్న ఇసుకను సరిచేయాలి.
అన్నారం, సుందిళ్లకు ఒకే తరహా మరమ్మతులు
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే తరహా సమస్యలు ఉండటంతో వాటికి ఒకే తరహా మరమ్మత్తులను ఎన్డీఎస్‌ఏ సూచించింది.
1. అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సీకెంట్‌ పైళ్లను పరిశీలించాలి.
2. నాలుగు వరుసల ఉన్న బ్లాకులను తొలగించి, వాటి కింద ఉన్న ఇన్వర్టర్డ్‌ పిల్లర్ల స్థానంలో జియో టెక్స్‌టైల్‌ పిల్టర్లు పెట్టాలి. రాళ్లు లేకుండా చేసుకోవాలి.
3. నాలుగు వరుసల్లోని సీసీ బ్లాకులను ఇనుప కడ్డీలతో అనుసంధానం చేసి, పరదను దిగువకు వదిలిపెట్టినప్పుడు అవి కొట్టుకుపోకుండా చూసుకోవాలి. ఇక రాఫ్ట్‌ కింద రంధ్రాలు ఉంటే గుర్తించి, గ్రౌటింగ్‌ చేయాలి.
ఈ సీజన్‌లో కూడా బ్యారేజీలకు హాలీడే
బ్యారేజీల మరమ్మతుల కోసం జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి, మరమ్మతుల కోసం తగిన డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేయాలని ఎన్డీఎస్‌ఏ రాష్ట్ర నీటిపారుదల శాఖకు గుర్తు చేసింది. అయితే మరో నాలుగు వారాల్లో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలున్నాయి. ఆయా పరీక్షలు చేయడానికే దాదాపు నెలరోజులకు పైగా సమయం పడుతుంది. ఇక డిజైన్లు, డ్రాయింగ్‌లకు కనీసం 15 రోజుల సమయం కావాల్సిందే. అదే జరిగితే ఈ సీజన్లో మరమ్మతులకు అవకాశాల్లేవు. ప్రధానంగా ప్రాణహితకు భారీగా వరదలుంటాయి. మేడిగడ్డకు ప్రతియేటా జూన్‌ నుంచి ఫిబ్రవరి దాకా ప్రాణహితకు వరదలు వస్తుంటాయి. డిసెంబరులోనే కాస్తా తగ్గుముఖం పట్టినా, రోజుకు 11 వేల క్యూసెక్కుల వరద ఫిబ్రవరి దాకా వస్తుంది. అన్నారం, సుందిళ్లకు నవంబరులో వరదలు తగ్గుముఖం పడతాయి. ఈ బ్యారేజీలను మరమ్మత్తులు చేయడానికి అవకాశం ఉన్నా, మేడిగడ్డకు మరమ్మత్తు అంత సులభం కాదు. మేడిగడ్డ మరమ్మత్తులు కత్తిమీద సాములాంటివే. మేడిగడ్డ లేకుండా ఇతర బ్యారేజీలన్నీ దండగే అని నీటిపారుదల శాఖ అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, తాపీగా వానాకాలానికి నెలరోజుల ముందు ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇవ్వడంతో మరమ్మతులు ఇక ప్రశ్నార్థకం కానున్నాయి.