నకిలీ విత్తనాలు అరికట్టాలి: రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి మండలంలో నకిలీ విత్తనాలను అరికట్టి, నకిలీ విత్తనాల వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని సందిబంధం గ్రామంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం బొమ్మల కనకరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ.. మండలంలో లైసెన్స్ లేకుండా విత్తనాల వ్యాపారం చేసే వారిపై వ్యవసాయ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. వ్యవసాయం మీద ఆధారపడిన గిరిజన, గిరిజనేతర పేదలను అనేక రకాల నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇష్టా రాజ్యంగా వడ్డీ వ్యాపారం నడుస్తుందని, అమాయక ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలను, ఇతర దోపిడీ దారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా పోడు సాగు దారులకు పెండింగ్ లో ఉన్న పట్టాలు వెంటనే ఇవ్వాలని, పోడు సాగుదారులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టవద్దని  ఆయన డిమాండ్ చేశారు. తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముసలి రామక్రిష్ణ, కొమరం రాందాస్, కొమరం పాపారావు, కొమరం రాంబాబు, దొడ్డి రాము, కొమరం శారద, మాజీ వార్డు మెంబర్ బొమ్మల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.