– గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టులో వివాదం తేలే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తే వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని గవర్నర్ స్పష్టంచేశారు. ఈమేరకు గవర్నర్ ప్రెస్ సెక్రటరీ పేరుతో బుధవారం ఒక ప్రకటన విడుదలైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణను నామినేట్ చేయాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పాదించింది. అయితే, ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ ఆ ప్రతిపాదనలను తిర స్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ వేర్వేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల విచారణ అర్హతపై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు పెద్దమనుషుల ఒప్పందంపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.