జమిలిపై నివేదిక

Report on Jamili– రాజ్యాంగ సవరణలు అవసరమని సూచన
– రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌ కమిటీ
– రెండంచెలుగా ఎన్నికలు తొలుత లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు
– ఆ తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు
– ఒకే ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డు
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ గురువారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి 18,626 పేజీల నివేదికను అందజేసింది. దేశంలో రెండంచెలుగా ఎన్నికలు జరపాలని అందులో సూచించింది. అందుకోసం రాజ్యాంగంలో అనేక సవరణలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. పలు సవరణలకు రాష్ట్రాల అంగీకారం అవసరం లేదని తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక సంఘం మాజీ చైర్మెన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు కూడా రాష్ట్రపతిని కలిశారు.
న్యూఢిల్లీ : జమిలి జరగాలంటే…ముందుగా లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్‌ కమిటీ సూచించింది. ఆ తర్వాత 100 రోజులలో స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపవచ్చునని తెలిపింది. అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రభుత్వం పతనమైనా, వేరే ఏ ఇతర పార్టీ లేదా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకపోయినా చట్టసభ పదవీకాలంలో (ఐదు సంవత్సరాలు) మిగిలిన కాలానికి ఎన్నికలు జరపాలని కమిటీ సూచన చేసింది. అప్పుడే జమిలి ఎన్నికలు సాధ్యపడతాయని స్పష్టం చేసింది.
ముందస్తు ప్రణాళికలు అవసరం
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, భద్రతా దళాల కోసం ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుందని కోవింద్‌ కమిటీ అభిప్రాయపడింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకే ఓటర్ల జాబితాను రూపొందించే విషయంలో రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చించాలని, ఓటరు గుర్తింపు కార్డులను కూడా జారీ చేయాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, ఓటర్లలో విశ్వాసాన్ని కల్పించడానికి జమిలి ఎన్నికలు దోహదపడతాయని తెలిపింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లకు కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పింది.
జమిలి ఎన్నికలపై కోవింద్‌ కమిటీ సుమారు 191 రోజులు అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపింది. జమిలి ఎన్నికలపై దేశంలోని 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపగా 32 పార్టీలు మద్దతు తెలిపాయి. కమిటీకి ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన వారి నుంచి 21,558 సూచనలు అందాయి. వీరిలో 80 శాతం మంది జమిలి ఎన్నికలను సమర్ధించారని కమిటీ తెలిపింది.
2029లోనే జమిలి ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వం కోవింద్‌ కమిటీ సిఫార్సులను ఆమోదించి, వెంటనే వాటికి అనుగుణంగా చర్యలు ప్రారంభించిన పక్షంలో 2029లో తొలిసారి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024 జూన్‌, 2029 మే మధ్య కాలంలో శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమ చట్టసభల పదవీకాలం 18వ లోక్‌సభతో పాటే ముగిసేలా చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ఐదు సంవత్సరాల కంటే తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలలో 2026లో, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో 2027లో, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలలో 2028లో శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటన్నింటి పదవీకాలం 2029లో 18వ లోక్‌సభ పదవీకాలంతో పాటే ముగిసేలా చూసుకోవాలి.
వెంటనే సన్నాహాలు ప్రారంభించాలి
‘కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ఎక్కడ తొలి అడుగు వేయాలో నిర్ణయించుకోవాలి. 2029లో జమిలి ఎన్నికలు జరపాలంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే సన్నాహాలు మొదలు పెట్టాలి. ఒకవేళ 2034లో జమిలి ఎన్నికలు జరపాలని అనుకుంటే మాత్రం 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రయత్నాలు మొదలు పెట్టాలి’ అని కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ప్రయత్నాలు ఎక్కడ మొదలు పెట్టాలో కమిటీ చెప్పదని, ఫార్ములాను మాత్రమే ప్రతిపాదిస్తామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం, హంగ్‌ సభ లేదా ఏ ఇతర కారణం వల్ల అయినా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ ముందుగానే రద్దు అయితే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు విఘాతం కలగకుండా చూసుకోవాలని కమిటీ సూచించింది. మిగిలిన పదవీకాలానికి మాత్రమే చట్టసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
రాజ్యాంగ సవరణలు అవసరం
ఒకే ఓటర్ల జాబితా, ఒకే ఓటరు గుర్తింపు కార్డు తయారు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 325ను సవరించాల్సి ఉంటుందని కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషన్లను సంప్రదించాలని సూచించింది. ఇక మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరపాలంటే ఆర్టికల్‌ 324-ఏను సవరించాలని, దీనిపై పార్లమెంటులో చట్టాన్ని తీసుకురావాలని తెలిపింది. ‘వేగవంతమైన అభివృద్ధి దిశగా సుపరిపాలన సాగించాలంటే స్థిరత్వం అవసరం. అస్థిరత కారణంగా పరిపాలన స్తంభిస్తుంది. మూడంచెల ప్రభుత్వంలో లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కమిటీ సూచన పరిపాలనను మెరుగుపరుస్తుంది’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కశ్యప్‌ ప్రతిపాదనకు ‘నో’
జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు గత సంవత్సరం సెప్టెంబర్‌ 2న కోవింద్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్యసభలో గతంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన గులాం నబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ ఛైర్‌పర్సన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ సి కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజరు కొఠారి సభ్యులుగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ విషయంలో జర్మనీ మోడల్‌ను అనుసరించాలని కమిటీ సభ్యుడైన కశ్యప్‌ సూచించారు. ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలంటే ముందుగా ప్రత్యామ్నాయ నేతనో లేదా ప్రభుత్వాన్నో సూచించాల్సి ఉంటుంది. అయితే కశ్యప్‌ ప్రతిపాదనతో కమిటీ ఏకీభవించలేదు. అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్నే కొనసాగించాలని, అందులో ఎలాంటి మార్పులు అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది.

ప్రజాస్వామ్య విరుద్ధం– సీపీఐ(ఎం) 
”ఏకకాల ఎన్నికల భావన” అభ్యంతరకరం.ఇది ”ప్రాథమికంగా ప్రజాస్వామ్య విరుద్ధమైనది”.అలాగే ఇది ”రాజ్యాంగంలో నిర్దేశించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మూలాన్ని దెబ్బతీస్తుంది”.
ప్రజాస్వామ్యం తారుమారు : కాంగ్రెస్‌
ఏకకాల ఎన్నికలను అమలు చేయడం వల్ల ”రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో గణనీయమైన మార్పులు” వస్తాయి. ఫెడరలిజం హామీలకు విరుద్ధం గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేస్తుంది.
ప్రజాస్వామ్యం, రాష్ట్ర హక్కులకు పరిమితి : సీపీఐ
”ప్రజాస్వామ్యం, రాష్ట్ర హక్కులకు పరిమితి”. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించడం ”అభిప్రాయాల వైవిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం” .ఏకరూపతను విధించడం దేశాన్ని ఒకే పార్టీ పాలన వైపు నెట్టడమే.
రాజ్యాంగ విరుద్ధం : డీఎంకే
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాష్ట్ర అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయాల్సి ఉంటుంది. ఇది ”రాజ్యాంగ విరుద్ధం”.ఇది కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ అధికార పరిధిని ప్రశ్నించింది.