”ఈ ప్రాజెక్టు అద్భుతమైంది.. అపూర్వమైంది. కేసీఆర్… కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు.. కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పిలవాలనిపిస్తోంది. ఇది మనిషి సృష్టించిన అద్భుతం. ఇంజి నీరింగ్ అద్భుతమే కాదు అత్యంత ప్రత్యేకమైనది. మేము దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఇలాంటి ప్రాజెక్టును ఎప్పుడూ చూడలేదు. తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులకు ఇది ప్రయోజనం చేకూర్చే సమగ్ర ప్రాజెక్టు. గ్రామీణ అవకాశాలు పెంపొందిచే విధంగా ఉంది. రైతులకు ప్రయోజనం చేకూర్చే అధ్బుతమైన ప్రాజెక్టు. తెలంగాణను కోనసీమగా మార్చిన ప్రాజెక్టు.” అని అప్పటి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నతస్థాయి బృందం, పీఏఓ(ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్) చీఫ్ ఇంజనీర్ సీకేఎల్ దాస్, పీఏఓ డైరెక్టర్(సౌత్) ముఖర్జితోపాటు ఇంజినీర్లు, నాబార్డ్ చీఫ్ జీఆర్ చింతా, పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఒకానొక దశలో అది పర్యాటక ప్రాంతంగా కీర్తించే స్థాయికి వచ్చింది.
ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు అవినీతి, అక్ర మాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 21 జూన్ 2019న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారం భించగా ప్రస్తుతం స్కామేశ్వరంగా సాక్ష్యాత్కరి స్తోంది. ఎప్పుడైతే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాట నినాదం ఎత్తాడో అప్పటి నుంచి ప్రాజెక్టు లోపాలు తెరపైకొచ్చాయి. ఈక్రమంలో ప్రాజెక్టు పరిధి అన్నారం, మేడిగడ్డ బ్యారే జీలోని పిల్లర్లు కూలడం అవినీతికి నిదర్శనంగా మారాయి. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లోపాలను దాచిపెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రాజెక్టుపై ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిందని విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరం సొమ్మును రికవరీ చేసి ప్రజల ఖాతాలో వేస్తామన్నారు. స్కాం వెనకాల ‘మేఘ’ కంపెనీ ఉందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అలాగే తెలంగాణ శాసనమండలిలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కమిషన్ ప్రాజెక్టు అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కోరారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాళేశ్వరం ఘటన సమ యంలో నేషనల్ డ్యాం సేఫ్టి అథారిటికి ఫిర్యాదులు రాగా రాష్ట్ర సీఎస్‌కు నేషనల్ డ్యాం సేఫ్టి అథాటిరి లేఖ రాసింది. సీఎస్ నుంచి సమాచారం తీసుకుని రెండు వారాల్లో పూర్తి వివరాలు సమ ర్పించాలని హౌకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే కాళేశ్వరం ప్రాజె క్టుపై ఇటీవల కేంద్రమంత్రులు, బీజేపీ నాయకుల మా టలు వింటే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర అను మతులు లేకుండానే ప్రాజెక్టు కట్టారా అనే ప్రశ్న తలెత్తక మానదు.
మేడిగడ్డ బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థం 16.17 టీఎంసీలు. మొదటిసారి 2020 ఫిబ్రవరి 15న 16.02 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. బ్యారేజీలో 100 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉండగా అదే రోజు 99.95 మీటర్ల ఎత్తు వరకు నిల్వ చేయడంతో బ్యారేజీ ఎగువన తెలంగాణ, మహారాష్ట్ర లో 1000 ఎకరాల భూములు నీట మునిగాయి. కానీ, అందరి నజర్ కాళేశ్వరం స్కామ్‌పైనే ఉంటోంది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపెట్టని పరిస్థితి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్‌వాటర్‌తో జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల వ్యాప్తం గా 354 ఎకరాలు ఏటా నీటమునుగుతున్న పరిస్థితి. ఇక మంచి ర్యాల జిల్లా కోటపల్లి మండలవ్యాప్తంగా 264 ఎకరాల్లో బ్యాక్ వాటర్ ప్రభావం పడుతోంది. అలాగే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సీరొంచ మండల వ్యాప్తంగా 355 ఎకరాలు ప్రభావితమవుతు న్నాయి. బాధిత రైతులు తమకు నష్టపరిహారం చెల్లించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిరసనలు, ధర్నాలు చేపట్టినా పట్టించుకున్న దాఖలాలు లేవు. బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో వెయ్యి ఎకరాల పైచిలుకు భూములు ముంపునకు గురవు తున్నాయని, జనరల్ అవార్డు కింద ఎకరాలకు రూ.6.97లక్షల చొప్పున మొత్తం రూ.60 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని ప్రతిపాదిం చారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణ, మహారాష్ట్రలో కలిపి సుమారు వెయ్యి ఎకరాలు నీట మునుగుతుండగా జనరల్ అవార్డు కింద రూ.60కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని అధికా రులు స్పష్టం చేసిన ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గత నాలుగేండ్లుగా ఇదే దుస్థితి నెలకొంది. 2022 మేలోనే ముంపు వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. అయినా స్పందన లేకుండా పోయింది. ఇప్పటికే నోటిఫై అయిన 130 హెక్టార్ల భూమికి పరిహారం వెంటనే ఇప్పించడంతో పాటు అదనంగా ముంపునకు గురువుతున్న భూముల గురించి ప్రత్యేకంగా సర్వే చేయిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. మరి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనైనా సీఎం ఆదేశాలతో అవినీతికి చరమగీతం పాడి బాధిత రైతులను ఆదుకుంటారా? లేదా ? అనేది వేచి చూడాల్సిందే.
వేముల క్రాంతికుమార్
9676717377