”భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ – సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్య్రాన్ని, అవకాశాల్లో, అంతస్తుల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మాకు మేము సమర్పించుకుంటున్నాము”. ఇది రాజ్యాంగ పీఠిక సారాంశం. దీని యొక్క సారాంశంగానే రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. అలా రూపుదిద్దుకుని అమలులోకి వచ్చి నేటికి 75 ఏండ్లు నిండుతున్నవి. దాదాపు మూడేండ్లపాటు తీవ్రమైన కృషిచేసి అనేక దేశాల పరిపాలనను, రాజ్యాంగాలను పరిశోధించి ఏర్పాటుచేసుకున్న అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా డా. బాబూ రాజేంద్ర ప్రసాద్, డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా డా|| బి.ఆర్.అంబేద్కర్‌లు, మరికొందరు మేధోసంపన్నులు చర్చించి అందించిన మహత్ ప్రణాళిక ఇది. అయితే ఎంతో శ్రమకోర్చి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ప్రజలందరి హక్కులకు, స్వేచ్ఛకు, ప్రజాస్వామిక విధానానికి హామీ ఇస్తూ సమర్పించిన అంబేద్కర్ ఏమన్నారంటే, ఈ రాజ్యాంగం ఘనమైనది, గొప్పదైనదీ అయినప్పటికీ, దీన్ని అమలు చేసే వాళ్లు చెడ్డవారైతే ఎందుకూ పనికిరాదని సెలవిచ్చాడు. ఆ ప్రమాదం 75 ఏండ్ల తర్వాత మరింత పెరిగింది.
రాజ్యాంగ నిర్మాణం కేవలం మేధావుల సృజనాత్మక అంశంగా రూపెత్త లేదు. రాజ్యాలు, సామ్రాజ్యాలు, రాజులు, సామంతులుపోయి బ్రిటీష్‌వారి ఏకచక్రాధి పత్యంలోకి వచ్చాక రెండు వందలేండ్లు సాగిన దోపిడిపై సమైక్యంగా ప్రజల తిరుగుబాటులోంచి స్వాతంత్య్ర పోరాటం నడిచింది. జాతి, మత, కుల, ప్రాంత భేదాల నొదిలి వీరోచిత త్యాగాల ఫలంగా స్వాతంత్య్రం సిద్ధించింది. ఆనాడు ప్రజలలో ఏర్పడిన ఐక్యత, సమానత, సౌభ్రాతృత్వాల కారణంగా వారి ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల ప్రతిబింబమే మన గణతంత్రం. మరి ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయి! ఏ దిశగా మన పయనం సాగుతున్నది చర్చించుకోవాల్సిన సందర్భం ఇది. ఈ రాజ్యాంగం ఏర్పడిననాడే, ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించమని, వ్యతిరేకిస్తూ మాట్లాడినవారు, ఇదే రాజ్యాంగం ప్రకారం ఎన్నికయి ఏలుబడిలో ఉన్నారు. వారి వారసులే మొన్నీమధ్య ఆగస్టు 15ను నిజమైన స్వాతంత్య్ర దినం కాదని, అయోధ్యలో రాముని ప్రతిష్ఠాపన రోజే స్వాతంత్య్రదినోత్సవమని ప్రకటించాడు. మనుధర్మమే రాజ్యాంగ ధర్మమనీ ఆలోచించేవారి చేతిలో రాజ్యాంగం అమలుకొనసాగటం నేటి విషాదం! 2015లో గణతంత్ర ఉత్సవాలను జరుపుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రాజ్యాంగ ప్రతుల పీఠికలో ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను తొలగించి అందించారు. అదేమంటే, ఆరంభాన అవిలేవని, మధ్యలో 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారని చెప్పారు. కానీ సామ్యవాద, లౌకిక విధానాలతో సాగాలని రాజ్యాంగంలో సారభూతంగా ఆది నుండీ ఉంది. 1973లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాజ్యాంగ స్వరూపాన్ని చెబుతూ లౌకిక ప్రజాస్వామిక, సమానత, స్వేచ్ఛ, సమాఖ్య, సమన్యాయాలతో కూడినదని తెలిపారు.
సమన్యాయం సాధించబడలేదు, సామాజిక న్యాయమూలేదు, ఆర్థిక అసమానత పెరిగిపోతున్నది. ఇప్పటికీ ఒక్క శాతం ప్రజల దగ్గర 23శాతం దేశ సంపద ఉంది. 10శాతం ప్రజల దగ్గర 55 శాతం సంపద పోగుబడి ఉందని ప్రభుత్వ రిపోర్టులే చెబుతున్నాయి. ప్రజలందరూ స్వేచ్ఛగా మాట్లాడే హక్కునూ లాగేస్తున్నారు. అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారు. తినే తిండి, కట్టుకునేబట్ట, పెళ్లి, ఉత్సవం ఏదీ కూడా పౌరులు స్వేచ్ఛగా ఆచరించే వీలు లేకుండా పోయింది. ఇక లౌకికత్వం అనే మాట హేళన చేయబడుతున్నది. మెజారిటీ మతానికి మైనారిటీ మతాల ప్రజలు లోబడి ఉండాలని, లేదంటే చంపుతామని, తరుముతామని బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఇక ప్రజాస్వామ్యమూ పలుచనపడిపోయింది. ఒక ఓటుకు ఒకే విలువ అన్నప్పటికీ ఒక మనిషికి ఒకే విలువ లేదు. ఓటూ సరుకై కొనుగోలుకు గురవుతున్నది. రాజకీయాలు ధనకీయాలయిపోయాయి. అందుకే కుబేరుల బొజ్జలు నింపుతూ, అన్నం పెట్టే రైతన్నలపై కండ్లెర్రజేస్తూ హింసిస్తున్నారు. న్యాయం కావాలన్న గొంతులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్బంధాలతో అణచివేతలు చేస్తున్నారు. ఇక సామ్యవాద సమసమాజ భావన తుడిచివేసారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంగలేస్తున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కులు అథఃపాతాళానికి తొక్కి వేయబడుతున్నాయి. కొత్త నేర చట్టాలతో ప్రాథమిక హక్కులే మృగ్యమవుతున్నాయి.
ఎన్ని సవాళ్లు, ఒడిదొడుకులు ఉన్నా ఇప్పటివరకూ దేశ ప్రజలను ఐక్యంగా నిలిపే ప్రయత్నంలో రాజ్యాంగం నిర్వహించిన పాత్ర ఘనమైనది. అనేక అవాంతరాలనూ అధిగమించింది కూడా. కానీ నేడు మత ప్రాతిపదకన ప్రజలను చీల్చే విధానాలు రాజ్యాంగ స్వభావాన్నే దెబ్బతీస్తున్నాయి. అసలు రాజ్యాంగం మీదనే విశ్వసమూ, అమలు చేయాలన్న నిశ్చయం లేని వారుగా పాలకులు ఉండటం నేడు రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. ప్రజల అప్రమత్తత, చైతన్యం మాత్రమే రాజ్యాంగానికి రక్ష.