దేశానికి రిపబ్లిక్‌ డే సంకేతాలు

Te mau tapa'o no te mahana o te Repupirita no te fenuaఈ రోజు దేశవ్యాపితంగా రిపబ్లిక్‌ డే.అంటే గణతంత్ర దినోత్సవం.దేశ రాజధానిలో భారత దేశ సైనిక పాటవాన్ని ప్రదర్శించడంతో పాటు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన శకటాలను కూడా ప్రదర్శిస్తారు.75 ఏండ్ల కిందట భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. వివిధ పత్రికల్లో రాజ్యాంగ రూపకల్పన చరిత్ర, ప్రాథమిక హక్కులు మౌలిక స్వభావం సుప్రీంకోర్టు తీర్పులు తదితర విషయాలపై జాతీయ పత్రికల్లోనూ తెలుగులోనూ చాలా వ్యాసాలు వెలువడ్డాయి. ఈ సందర్భంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రధాన వ్యాసం ఏడున్నర దశబ్దాల తర్వాత కూడా మున్ముందుకు..అనే శీర్షికతో వ్యాసం వెలువడింది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాసిన వ్యాసం తెలుగులో వచ్చింది.రాజ్యాంగాన్ని వలసవాద పత్రమని కొంతమంది పేర్కొనడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో భారతీయమేదీ లేదని ఆరోపించిన సంస్థ సాక్షాత్తూ ఆరెస్సెస్‌ మాత్రమేనని ఆ కుదురు నుంచే వచ్చిన నేతలకు తెలియకపోవడం ఆశ్చర్యమే.అప్పట్లో రాజ్యాంగ నిర్మాతలు అమెరికా, బ్రిటన్‌, కెనడా, స్విడ్జర్లాండ్‌ వంటి దేశాల రాజ్యాంగాలను కూలంకషంగా అధ్యయనం చేస్తే దానికి మింగుడు పడలేదు. రాజ్యాంగంలో భారతీయతే లేదని దాన్ని ఆమోదించిన రోజునే వారి అధికార పత్రిక ‘ఆర్గనైజర్‌’లో రాశారు. ఆగష్టు 15స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవం రెండే జాతీయ పర్వదినాలుగా జరు గుతూ వచ్చాయి. మోడీ నవంబరు 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు అంటూ దానికి రాజ్యాం గ దినోత్సవం పేరు పెట్టారు. 2015లో అధికారికంగా తీసుకున్న ఈ నిర్ణయం జనవరి 26 రిపబ్లిక్‌ డే ప్రాధాన్యత తగ్గించేందుకే.
జనవరి 26 ఎందుకు?
1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి తీసుకురావడం స్పష్టమైన అవగాహనతో జరిగింది. 1930జనవరి 26న పూర్ణస్వరాజ్‌ దినోత్సవం జరపాలని కాంగ్రెస్‌ జాతీయోద్యమకాలంలో ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకోవడానికి ఈ తేదీని తీసుకున్నారు. కాని కాంగ్రెస్‌ పూర్ణస్వరాజ్‌ పిలుపునివ్వడానికి రంగం సిద్ధం చేసింది కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భావం. కాంగ్రెస్‌తో విభేదించి స్వర్జాజ్య పార్టీ పెట్టుకున్న మోతీలాల్‌ నెహ్రూ ప్రభృతులు పరిమిత ప్రతిపత్తితో అధికారం పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. దేశ ప్రజలకు సమ్మతించదగిన రాజ్యాంగం ఇవ్వాలని 1924లో స్వరాజ్‌ పార్టీ తీర్మానం చేసింది. 1920లో తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీకి అంకురార్పణ జరిగిననాటి నుంచి సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ వచ్చారు. 1921 అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ మహాసభలో వారే పూర్తి స్వాతంత్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు, మళ్లీ 1927లో మద్రాసు కాంగ్రెస్‌ మహాసభలో జవహర్‌లాల్‌ నెహ్రూ పైన చెప్పినట్టు పూర్ణస్వరాజ్‌ కోసం 1930జనవరి26న పతాకావిష్కరణలు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టి నపుడు బలపర్చిన ప్రతినిధి జోగ్లేకర్‌ కమ్యూనిస్టు నాయకుడే. 1947లో దేశానికి స్వాతంత్య్రం కూడా ఆ తేదీనే ప్రకటించవచ్చునని మొదట భావించారు.అయితే ఘోరమైన మతకలహాల కల్లోలం రీత్యా కాస్తముందుకు జరిపి ఆగష్టు 15నే ప్రకటించారు. 1948 జనవరి 26న ఈ విషయాలు సభల్లో చెప్పారు కూడా. నిజంగానే 1948 జనవరి 30న గాంధీజీని మతశక్తులు హత్య చేయడంతో ఆ భయాలు నిజమయ్యాయి.
గాంధీజీ హత్య,అంబేద్కర్‌కు అవమానం
1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు మొదలు పెట్టేనాటికి దేశం మతకలహాల ముప్పునూ సామ రస్యత లౌకికతత్వం ఆవశ్యకతనూ గుర్తించగలిగింది. గాంధీజీ హత్యకు శిక్ష విధించబడిన గాడ్సేను దేశ భక్తుడుగా చెప్పేవారు. ఆయన గురువైన వీరసావర్కార్‌ను పార్ల మెంటులో ప్రతిష్టించినవారు దేశాధిపత్యం చేపట్టిన ఫలితమిది. రాజ్యాంగస్ఫూర్తిపై దాడికి నవంబరు 26 నిర్ణయం తొలిఅడుగు మాత్రమేనని తర్వాత వరుసగా జరుగుతున్న మార్పులు,చర్యలు, తాజాగా తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లులు వంటివన్నీ స్పష్టం చేస్తున్నాయి.
లిఖిత రూపంలో ప్రపంచంలో మరేదేశానికి లేనంత పెద్దది భారత రాజ్యాంగం. దానికోసం జరిగిన లోతైన చర్చల్లో 36 లక్షల పదాలు వున్నాయని రికార్డులు చెబుతున్నాయి.3675 సవరణలను లేదా ప్రతిపాదనల్లో 2473 వివరంగా చర్చించి నిర్ధారణలకు వచ్చారు. 395 అధికరణలు, 8 షెడ్యూళ్లలో వీటిని పొందుపర్చారు. ఆరోగ్యం అంత బాగాలేనప్పటికీ భీమ్‌రావ్‌ రాంజీ అంబేద్కర్‌ దానికి తుదిరూపమివ్వడానికి అంకితమయ్యారని రాజ్యాంగ పరిషత్‌ ఛైర్మన్‌ తొలిరాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. దాదాపు 300 మంది రాజ్యాంగ పరిషత్‌ సభ్యులు ఇంచుమించు మూడేండ్లపాటు శ్రమించి, చర్చించి, తర్కించి, వాదించి, శోధించి దాన్ని జాతికి అందించారు. మొదట ఇందుకు సంబంధించిన ఎజెండా ప్రతిపాదిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇది మన సంకల్పం అని ప్రతిజ్ఞ అనీ ప్రకటించారు. ఆయనే మళ్లీ తొలి ప్రధానిగా అధికారం స్వీకరిస్తూ ప్రపంచమంతా నిద్రలో వున్న ఈ సమయంలో భారతదేశం స్వాతంత్య్ర యుగోదయంలోకి ప్రవేశిస్తున్నదని ప్రకటించారు. నిరంతర అప్రమత్తతే స్వాతంత్య్రానికి మూలం అన్నది శాశ్వత సూక్తి. రాజ్యాంగ రూపకల్పనలోనూ ఆమోదించి అమలుకు తేవడంలోనూ స్వాతంత్య్ర యోధులు, న్యాయ కోవిదులు, దేశభక్తులు ఆదర్శంగా పెట్టుకున్న లక్ష్యాలకూ ఈనాటి పరిస్థితికి పొంతన ఏమైనా వున్నదా అని బేరీజూ వేసు కోవాలి.ఎందుకంటే రాజ్యాంగం అమలు తీరు నిజమైన కొలబద్ద అని చెప్పిన అంబేద్కర్‌ బొమ్మ పెట్టుకోవడం కన్నా దేవుడిబొమ్మ పెట్టుకుంటే పుణ్యం వచ్చేదని హోంమంత్రి అమిత్‌ షా రాజ్యాంగ వార్షికోత్సవ చర్చలోనే అనడం ఇందుకు నిదర్శనం.
స్పూర్తికి ఎసరు
‘దేశమంటే మనుషులోరు’ అన్నట్టే, రాజ్యాంగమంటే దాని మౌలిక స్వభావమే, ఇచ్చే నిర్దేశమే తప్ప నిర్జీవ నిబంధనలు కాదు. రాజ్యాంగం 368వ అధికరణం పరిస్థితులకు తగినట్టు దాన్ని మార్చుకునే అధికారం ఇస్తున్నదని మొదట పేర్కొన్న ‘టైమ్స్‌’ వ్యాసం చెబుతుంది. రాజ్యాంగం మౌలిక స్వభావం సిద్ధాంతం కూడా తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిందే తప్ప అందులోది కాదని ఆ వ్యాసకర్త అంటారు.రాజ్యాంగంలో ఏదీ పరమ పవిత్రం కాదని స్వయంగా రెండోస్థానంలో వున్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌ ఇటీవల వాకృచ్చారు. ఏది ఎలాగైనా మార్చే యోచన ఉన్నట్టయితే ఇక దేశాలకు రాజ్యాంగాల అవసరమే వుండదు. ఒక విధాన చట్రంగా మూలసూత్రాలుగా వాటి పరిధిలోనే వ్యవహారించాలన్నది ఇక్కడ కీలకం. 368 ప్రకారం పార్లమెంటులో బలం వుంది గనక ఏది ఎలాగైనా తలకిందులు చేస్తామంటే చెల్లుబాటు కాదు, కాకూడదు.
స్వభావరీత్యా ప్రజాస్వామికం, రాజరికం రెండు రకాలు (డెమోక్రసీ, మోనార్కీ).పాలనాపరంగా అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా(ప్రెసిడెన్సియల్‌ పార్లమెంటరీ) అధ్యక్ష తరహా,అధ్యక్ష తరహా పార్లమెంటరీ మిశ్రమం, పూర్తి పార్లమెంటరీ తరహా అనే మూడు విధానాలు ప్రపంచంలో వున్నాయి. అధ్యక్ష తరహాలో అన్నీ అధ్యక్షులే శాసిస్తారు. మిశ్రమ తరహాలో ప్రధాని అధ్యక్షుడు(రాష్ట్రపతి) ఉభయులూ పార్లమెంటుకు బాద్యత వహిస్తారు. మరికొన్ని చోట్ల అధ్యక్షుడే ప్రధానిని ఎంపిక చేస్తూ పాలన చేస్తాడు. మిశ్రమ పద్ధతిలో కొన్నిచోట్ల అధ్యక్షుడు కొన్ని చోట్ల ప్రధాని కీలక పాత్ర వహిస్తారు. మన దేశంలో రాష్ట్రపతి నామమాత్రం కాగా ప్రధాని సలహాపైనే నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ విధానాన్ని కూడా ఇష్టప్రకారం మార్చేసే వీలుండదు. మన చుట్టుపక్కల శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల వీటిని అటూ ఇటూ మార్చిన ఉదాహరణలున్నాయి. వాటిని కోర్టులు కొట్టివేసిన సందర్భాలూ వున్నాయి, రాజకీయ వ్యవస్థ బలహీనంగా వున్నచోట్ల సైనికబలంతో అమలు చేసిన హెచ్చరికలూ వున్నాయి. ఇప్పుడు ప్రధాని చేతుల్లో విపరీతాధికారాలు పోగుపడుతున్న ప్రస్తుత పరిస్థితి పరోక్ష అధ్యక్ష తరహాకు దారితీస్తున్నదనే విమర్శలు వింటూనే వున్నాం. ఇది రిపబ్లిక్‌ డే నాడు శకటాలను ఇష్టానుసారం తిరస్కరించడంలోనూ కేంద్ర పెత్తనమే గోచరిస్తుంది.జమిలి ఎన్నికల బిల్లు దాన్నే ప్రతిబింబిస్తుంది. పౌరులందరికీ సమాన హక్కులు, ప్రజలచే ఎన్నికవ్వడం,లౌకిక తత్వం,సమాఖ్య తత్వం అన్నవి మన రాజ్యాంగానికి మౌలిక లక్షణాలు. వీటిపై జరుగుతున్న దాడులు అందుకు వ్యతిరేకంగా పోరా టాలు గమనిస్తే 75 ఏండ్ల రిపబ్లిక్‌ సన్నివేశం కండ్లకు కడుతుంది.
జవాబుదారీతనం మాయం
‘రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మేము మాకు ఇచ్చుకుంటున్నాము’ అని పేర్కొంటున్నాం. అంటే వ్యవస్థలో జరిగిన దానికి చేసిన దానికి ఎవరో ఒకరు అందరికీ జవాబుదారీగా వుండాలి.అధ్యక్ష తరహా పార్లమెంటరీ తరహా ఏదైనా సరే. మనం తీసుకున్న పార్లమెంటరీ వ్యవస్థలో అందరూ రాజ్యాంగానికి జవాబుదారి. కేంద్రంలో వారు పార్ల మెంటుకు రాష్ట్రాల్లో పాలకులు శాసన సభలకూ జవాబుదారీ. ఓటర్ల ఆమోదంతో ఎన్నికై అధికారం చేపట్టి విధానాలు చట్టాలు రూపొందించేవారు సుప్రీంకోర్టుకు జవాబు దారీ.అంటే వారు చేసిన చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు లో బడి వున్నాయా లేదా అని సుప్రీంకోర్టు, హైకోర్టు చెబుతాయి. న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయ వలసిందే. ఏ వ్యవస్థ రాజ్యాం గానికి అతీతం కాదు. అయితే జవాబుదారీ తనం సమిష్టిగానూ వ్యక్తిగతం గానూ వుం టుంది. ఉదాహరణకు సభల్లో బలాన్ని బట్టి ప్రధాని, ముఖ్యమంత్రి నియామకం జరిగాక మంత్రివర్గం దాని తరపున నాయకులుగా వున్న ప్రధాని లేదా ముఖ్యమంత్రి సభకు బాధ్యత వహించాలి. అంతర్గతంగా ఆయా శాఖలు లేదా విభాగాలు చూసేవారు ముఖ్యమంత్రికి, ప్రధానికి, ప్రభుత్వాలకు బాధ్యత వహించాలి.ఇది విస్తృతమైన విభజన. కానీ రాజధానుల నుంచి ప్రాజెక్టుల వరకూ దేశమంతటా కొనుగోళ్ల నుంచి నిధుల వరకూ ఎన్ని తప్పులు జరిగినా, ఎన్ని కేసులు నడిచినా పూర్తి బాధ్యత ఎవరిదనేది తేల్చడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అస్మదీయులు తస్మ దీయులనే ప్రాతిపదికన వెళ్లడం కోర్టుల్లోనూ రకరకాల తీర్పులు రావడం జరిగిపోతుంది. అదానీ విద్యుత్‌ కొనుగోళ్లు,కాళేశ్వరం, పోలవరం, అమరావతి, బీహార్‌లో గుజరాత్‌లో బ్రిడ్జిలు పతనం ఎన్ని సంచలనాత్మక తప్పిదాల్లో బాధ్యత తేల్చారా?గుజరాత్‌ మారణకాండతో సహా ఎన్నో జరిగిపోయాయి. కానీ పాలకులు ఎవరిపైనా ఏదైనా చర్య చూశామా?
ఇప్పుడు ఒక అధికార పార్టీ లేదా కూటమి సభలో విశ్వాసం కోల్పోతే, కాదంటే బలాబలాలు మారితే దిగిపోవలసి వుంటుంది.మరెవరూ ముందుకు రాకపోతే సభ రద్దయిపోతుంది. కానీ జమిలి బిల్లు వస్తే ఇదీ వుం డదు. కేంద్రం, రాష్ట్రం, గవర్నర్‌, రాష్ట్రపతి మధ్య ఏ ప్రభుత్వం, ఏ సభ రద్దవుతుందో, కొనసాగుతుందో తెలియని స్థితి. ఎందుకంటే ప్రభుత్వం పడిపోయినా వెంటనే ఎన్నికలు జరపాల్సిన పనిలేదు.కొత్తగా వచ్చే ప్రభుత్వం మిగిలిన కాలానికి మాత్రమే పనిచేస్తుంది.(ఉప ఎన్నికల్లో మిగిలిన కాలమే వున్నట్టు) అంటే జవాబుదారీతనం ఎటుపోతుంది? కొత్తగా ఎన్నికైనవారి పదవీ కాలం తగ్గించడమంటే ఎవరి తప్పుకు ఎవరిని శిక్షిస్తున్నట్టు? పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాలు, భారీ కుంభకోణాలు,లక్షల కోట్ల ఎగవేతలు, ప్రజల ఆస్తులు కట్టబెట్టడాలు – వీటికి పాలకుల బాధ్యత ఏమై పోతున్నట్టు? సార్వభౌమత్వాన్ని కాపాడవలసిన కేంద్రపాలకులు అమెరికా వంటి దేశాల ఒత్తిడికి లోబడిపోతే పార్లమెంటుకు కూడా జవాబుదారీతనం ఎక్కడ మిగిలేట్టు? తమ రాజకీయ అవసరాల కోసం దుస్సాహస నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ చర్చ జరిగేట్టు? అలాగే అధికారాన్ని నిరంకుశంగా వినియోగించి ప్రజల హక్కులు హరిస్తే ఎక్కడ విచారించేట్టు? ఇవన్నీ 75ఏండ్ల అనుభవం ముందుకు తెస్తున్న కీలక సవాళ్లు. వాటికి జవాబులు వెతకాల్సింది పోయి, ఉన్న హక్కులను కూడా తొలగించడం, వ్యవస్థలను తలకిందులు చేసి వ్యక్తుల పెత్త నాలు రుద్దడం అనుమతించ రానిది. ట్రంప్‌ ప్రమాణ స్వీకారంలో ఎలన్‌మస్క్‌ చక్రం తిప్పినట్టే ఇక్కడ పాలకుల నీడన అదానీలు, అంబానీలు, ఇంకా రాష్ట్రాల కుబేరులు ధనాన్ని, మతాన్ని జోడించి స్వారీ చేస్తుంటే ఇక జవాబుదారీ తనం, రాజ్యాంగ విలువలు ఎటుపోయేట్టు? ఆగష్టు 15న జెండా ఎగరేస్తారు.అంటే ఒక ఎత్తుకు చేరుస్తారు. జనవరి 26న పైనకట్టి వున్న జెండా ఆవిష్కరిస్తారు. అంటే స్వేచ్ఛగా ఎగిరేలా చేస్తారు. తెచ్చుకున్న స్వాతంత్య్రాన్ని సరిగ్గా కాపాడుకోవడమే ఇందులో సందేశం.
– తెలకపల్లి రవి