రాజ్యాంగంపై దాడులను తిప్పికొట్టండి

రాజ్యాంగంపై దాడులను తిప్పికొట్టండి – ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ.శ్రీనివాసులు
నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని, వ్యక్తి కేంద్రంగా స్వేచ్ఛ, హక్కులు కల్పించబడ్డాయని, దీనికి సామాజిక పరివర్తన స్వభావం ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసులు అన్నారు. హైదరాబాద్‌ కోఠి బీసీసీఈ భవన్‌లో సోమవారం ఉప్పుమావులూరు సాంబశివరావు (ఉ.సా) 73వ జయంతి కార్యక్రమాన్ని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో ‘రాజ్యాంగం- ప్రజా పోరాటాలు- ప్రజాదృక్పథం’ అనే అంశంపై ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసులు ప్రసంగించారు. భారత రాజ్యాంగం హేతువు ఆధారంగా తయారు చేయబడిందని, విశ్వాసాల ఆధారంగా తయారు కాలేదన్నారు. దాదాపు 400 సంవత్సరాలుగా ప్రజలు బ్రాహ్మణ వ్యతిరేక, కుల వ్యతిరేక ఉద్యమాలు చేయడం ద్వారా ఈ రాజ్యాంగానికి రూపకల్పన జరిగిందన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కెవై.రత్నం మాట్లాడుతూ.. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనుధర్మశాస్త్రం అమల్లో ఉన్నదని.. దాని స్థానంలో రాజ్యాంగం అమల్లోకి రావడం అంత చిన్న విషయం కాదని చెప్పారు. అందుకు ప్రజల కఠోర ఉద్య మాలు, స్వతంత్ర ఉద్యమాలు పనిచేశాయని తెలియజేశారు. ప్రజల హక్కుల సాధన కోసం ఇంకా ప్రజాపోరాటాలు చేయాల్సిన అవసరముందని చెప్పారు.
కెజె.రామారావు మాట్లాడుతూ.. మనదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగం అమలు కోసం కొట్లాడాల్సిన అవసరముందన్నారు. ఈ రాజ్యాంగం ప్రశ్నించే హక్కు, స్వేచ్ఛకు హామీ ఇస్తున్నదన్నారు. హిందూత్వ శక్తులు ఈ రాజ్యాంగాన్ని సహించకుండా.. ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నియంతృత్వ.. మనస్మృతిని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని,ఈ క్రమంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉందన్నారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. బహుళ సంస్కృతి ఉన్న ఈ దేశంలో ఒకే సంస్కృతి అని మాట్లాడటం సరైనది కాదన్నారు. ఈ సభలో రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఇంద్రవెల్లి రమేష్‌, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి కన్వీనర్‌ బండారి లక్ష్మయ్య, సమితి రాష్ట్ర అధ్యక్షులు గురిమిళ్ళ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.చక్రవర్తి, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సైదమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య భారతి, కెఏఎన్‌పిఎస్‌ నాయకులు గోవిందు, లక్ష్మయ్య మోహనకృష్ణ, వెంకటయ్య, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.