నిజానికి అబద్దానికీ తేడా తెలుసుకోలేని వారు, సరైనదేదో సరికానిదేదో తెలుసుకోలేరు. వాళ్లు స్వతహాగా ఆలోచించే శక్తిని కోల్పోయారన్నమాట! దేశంలో ప్రజల్ని ఆ విధంగా తయారు చేసి, తమ ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించవచ్చని ప్రస్తుత ఆరెస్సెస్- బీజేపీ ప్రభుత్వం అనుకుంటోంది. పరిశీలనకు, విశ్లేషణకు అతికొద్దిమంది మాత్రమే పూనుకుంటారు. జనబాహుళ్యం వాడుకలో ఉన్న అబద్ధాలను నమ్మి దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక విషయం గమనించండి. దేవుళ్ల చిత్రపటాలు, ప్రతిమలు, శిల్పాలు దుకాణంలో ఉన్నంత వరకు వాటికి శక్తులేవీ ఉండవు. కానీ, వాటిని దేవాలయాల్లో, ఇండ్లలో ప్రతిష్టించుకోగానే వాటికి ఏవో శక్తులున్నట్టు భావిస్తుంటారు. దేవతా విగ్రహాల చిత్రపటాల శక్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిరూపించబడ్డాయా?
”మనుషుల్ని చంపి, మతాన్ని రక్షించడంకంటే – మతాన్ని చంపి మనుషుల్ని రక్షించడమే మేలు” అని అన్నాడు బుద్ధుడు. ఆమాటను ఇప్పటి జనం గుర్తుంచుకోవడం లేదు. ”హంనే ఘర్ కి సలామతీ కెలియే… ఖుదా కొ ఘర్ సే నికాల్ రఖా హై” అన్నాడొక ఆధునిక ఉరుదూ కవి. (ఇంటి క్షేమం కోసం మేం, దేవుణ్ణి ఇంట్లోంచి బయటికి పంపించాం! అని అర్థం)
ఎవరో ఒక శిల్పి చెక్కిన శిల్పానికి శక్తి ఉంటుందా? ఎవరో ఒక చిత్రకారుడు గీసిన చిత్రానికి శక్తి ఉంటుందా? అని ప్రజలు ప్రశ్నించకుండా ఇవి ఇప్పటివి కావు. అనాది కాలంవి లేక అతి ప్రాచీనమైనవి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ – అని మూఢ విశ్వాసం సడలిపోకుండా చేస్తుం టారు. రాగల తరాలవారు కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండాలని, అదే మన సనాతన సంప్రదాయం, ఆచారం – అని చెపుతూ ఉంటారు. పైగా పాటించకపోతే కీడు కలుగుతుందని భయపెడతారు. అధిక సంఖ్యాకులు ఈ విషయం లోతుగా ఆలోచించారు. ‘ఏదో పెద్దలు చెప్పింది పాటిస్తే సరిపోతుంది కదా’ – అని అనుకుంటారు. ‘ఎందుకు మన మెదడు పాడుచేసుకోవడం’? అని అనుకుంటారు. కానీ, అలా అనుకోవడం వల్లనే వారు తమ మెదళ్లు పాడు చేసుకుంటున్నా రన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవడి మెదడు వాడు ఉపయోగించుకోకుండా, మరొకరి మెదడు చెప్పినట్టు చేయడం తెలివిగల పనా? ఆ మరొకడి మెదడు బూజు పట్టి ఉంటే- అదే బూజును నువ్వు కొనసాగిస్తున్నట్లే కదా?
అందుకే చూడండి! పూజలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రార్థనా స్థలాల సందర్శనాలు… అన్నీ ‘ఫార్మా లిటీ’గా మారిపోయాయి. ఎవరికీ దేని మీదా భక్తీ శ్రద్ధా ఉండటం లేదు. అవి ఉన్నట్టు ప్రదర్శించుకునే వారు కొంద రుంటారు. వారైనా ఎందుకుంటారంటే వారి జీవితం ఆ పూజల మీద ఆధారపడి ఉంటుంది – గనక! షాపింగ్ మాల్ వెళ్లామా? కావల్సింది కొనుక్కున్నామా? తిరిగి వచ్చా మా? అన్నట్లు ఈ రోజుల్లో జనం గుడికి వెళ్లామా? గంట కొట్టామా? దక్షిణ సమర్పించుకున్నామా? శఠగోపం పెట్టించుకున్నామా? తీర్థ ప్రసాదాలు తీసుకున్నామా ? వెనక్కి తిరిగొచ్చామా?- అన్నట్లు ఉంటున్నారు. తప్పిస్తే, అలా ఎందుకు చేస్తున్నామని మనసుపెట్టి ఆలోచించడం లేదు. తాతల నుండి వస్తున్న ఆచారం కదా అని సర్దిచెప్పుకుంటూ ఉంటారు. తాతలనాటి జీవనవిధానానికీ, మారిన పరిస్థి తుల్లో ఇప్పటి జీవన విధానానికి అసలు పోలికే లేదన్నది మాత్రం ఆలోచించరు. దీన్నే గొర్రెదాటు పోకడ – అంటారు.
ఈ విశ్వానికి ఏ సృష్టికర్త లేడు. అది 13.77 బిలియన్ (పదమూడు వందల డెబ్బయి ఏడు కోట్ల) సంవ త్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనంతో దానికి అదే ఆవిర్భవించింది! ఈ విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ప్రపంచ శాస్త్ర వేత్తలంతా రుజువులతో బలపరిచారు. ఈ వాస్తవాన్ని విశ్వసించకుండా కల్పించుకున్న అతీతశక్తులకు దాసో హమ నడం అవసరమా? నిజాన్ని అర్థం చేసుకుని, దాన్ని స్వీకరించే స్థాయి మనుషులకు ఎప్పుడొస్తుందీ? భౌతికంగా పుట్టి, భౌతికంగా జీవించి, భౌతికంగానే తనువు చాలించే మనిషికి కల్పించుకున్న మతలు, కృత్రిమంగా ఏర్పరుచు కున్న కులాలు ఇంకా అవసరమా! వాటికి అతీతంగా ఎదిగి సత్యాన్ని గుర్తించి మనుగడ సాగించనవసరం లేదా?
మేధస్సుకు-నాస్తికత్వానికీ మధ్య గల సంబంధం మీద కొందరు పరిశోధకులు దృష్టి సారించారు. విలువైన ఫలితాల్ని వెల్లడించారు. మేధావుల్లో ఎక్కువమంది నాస్తికులు కావడానికి అవకాశాలున్నాయని యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగిన పరిశోధనలు చెపుతున్నాయి. మేధావుల్లో ప్రశ్నించే మనస్తత్వం ఉండడం వల్ల నాస్తికత్వ – వ్యక్తిత్వం ఏర్పడుతుందని అంటున్నారు. బ్రిటన్‌లోని అల్‌స్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ లిన్ (ఖచీ×Vజు=ూ×ు్ ఉఖీ ఖూూుజు= : =×జనA=ణ ూ్‌చీచీ(1930 – 2023) ఖ.ఖ) అతని పరిశోధకుల బృందం ఈ అంశంపై పరిశోధనలు చేసింది. ఫలితాలను వారు ‘ఇంటిలిజెన్స్’ అనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. మనిషి మెదడుకూ నాస్తికత్వానికిగల సున్నితమైన బంధాన్ని పరిశోధకులు ఒడిసి పట్టుకున్నారు. ఈ పరిశోధకులు చెప్పింది ఏమిటంటే – మామూలు మనుషులతో పోలిస్తే మేధావుల్లో, ఆలోచనాపరుల్లో, పరిశోధకుల్లో ‘ఐక్యూ’ ఎక్కువగా ఉంటుంది. ఐక్యూ – ఎక్కువగా ఉన్న వారు ప్రశ్నలు ఎక్కువగా సంధిస్తారు.
ప్రశ్నించగలవారు విశ్వాసాలకు దూరంగా ఉంటారు. పైగా, అంధవిశ్వాసాల్ని తీవ్రంగా నిరసిస్తారు. రాయల్ సొసయిటీ నిర్వహించిన సర్వే ఫలితాలను ఆధారం చేసుకుని, ప్రొఫెసర్ రిచర్డ్ లిన్ పరిశోధకుల బృందం ఈ విశ్లేషణలు చేసింది. ప్రొఫెసర్ లిన్ తనకుతాను సైంటిఫిక్ రేసిస్ట్‌గా ప్రకటించుకున్నాడు. ఈ సర్వేలో 68.5 శాతం మంది ప్రజలు తాము అస్తికులమని చెప్పుకున్నారు. కానీ, అందులో దేవుణ్ణి గట్టిగా నమ్ముతున్న వారు కేవలం 3.3 శాతమే! ప్రాథమిక పాఠశాలల్లో చదువుకుంటున్న బాలబాలికలందరూ ఆస్తికులే. కానీ, వారు యవ్వన దశలోకి వచ్చాక – అంటే తెలివి తేటలు కాస్త పెరిగాక దైవ భావనపై సందేహం వెలిబుచ్చుతూ ఉంటారు. ప్రగతి పధాన నడుస్తున్న 137 ప్రపంచ దేశాల్లో మత విశ్వాసం సన్నగిల్లుతున్నట్టువారు వారి అధ్యయనంలో తేల్చారు. ఆ దేశాల్లోని సగటు మనుషుల్లో మేధోస్థాయి పెరగడమే ఇందుకు కారణమని, ప్రొఫెసర్ రిచర్డ్‌లిన్ ప్రకటించాడు. ఈయన మరొక విషయం కూడా స్పష్టం చేశాడు. సంస్కృతి, సంప్రదాయమనే- అంధ విశ్వాసాల్లో మునిగిపోయి, బయటి ప్రపంచాన్ని చూడలేక, నూతిలో కప్పల్లా జీవించే వారు కొందరుంటారనీ, వారిలో ప్రశ్నలుండవని కాదుగానీ, వారు వాటిని లోపలే అణిచిపెట్టుకుని, తమను తాము మోసం చేసుకుంటూ – ప్రశాంతంగా బతుకుతున్నామని ఆత్మద్రోహం చేసుకుంటూ ఉంటారనీ.. అంటాడు.
అయితే ప్రొ||లిన్ బృందం చేసిన పరిశోధనలను గోర్డాన్ లించ్ అనే మరో ప్రొఫెసర్ విమర్శించాడు. ఈయన లండన్ బర్క్‌బెన్ కళాశాలకు చెందిన వాడు. ఆయన చెప్పేది ఏమంటే – ఇలాంటి పరిశోధనలకు సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రభావాలనెన్నింటినో పరిగణించాల్సి ఉంటుందనీ – ఆ పని ఈ ప్రొ||లిన్ పరిశోధక బందం సరిగా చేయలేదని ఆరోపించాడు. ఈయన అంటున్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఆ దిశలో కూడా పరిశోధనలు జరగాల్సే ఉంది. ఏదిఏమైనా, ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా .. దైవ విశ్వాసానికీ, పశ్నించేతత్వానికీ సంబంధం ఉందన్న ప్రొ|| రిచర్డ్ లిన్ బృందం పరిశోధనల్ని కొట్టి పారెయ్యలేం – ఎందుకంటే, వారు సాధించిన ఫలితాల్లో నిజం ఉంది. వారు చెప్పిన విషయాలు మనం నిత్యజీవితంలో – మనచుట్టూ ఉన్నవారిలో కూడా చూస్తున్నాం. బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వద్ధాప్యం- దశలలో అభిప్రాయాలు ఆలోచనా విధానం మారుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆలోచన పెరిగి, వివేకవంతులవుతున్న కొద్దీ ప్రతి విషయాన్ని ప్రశ్నించి నిగ్గుతేల్చుకునే లక్షణం పెరుగుతూ వస్తున్న విషయం, మన పరిశీలనలో మనకు కనిపిస్తున్నదే!
ఇంతదాకా సాధించిన విజయాలన్నీ మనిషి తన స్వశక్తితో సాధించుకున్నవేనన్నది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంధవిశ్వాసాల్ని అంతం చేసుకుంటూ, మనిషి తనను తాను స్థిరపరుచుకునే అవసరం ఇప్పుడు అత్యవసరంగా ఉంది. మనిషే మనిషి విలువను ఎప్పుడూ దిగజార్చుకోగూడదు. ఉబికివస్తున్న ప్రశ్నల గొంతుల్ని తొక్కిపెట్టకూడదు. సమాజంలో జీవితాలు దుర్భరమైపోతుంటే, జనం గొంతెత్త లేని నిస్సహాయతలో మిగిలి పోగూడదు. శక్తిని కూడగట్టుకుని-మనిషి ఎప్పుడూ దేనికీ బలహీనుడు కాడు – అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉంది. –
మానవ జీవితాలన్నీ నదులైతే, మానవవాదం – ఒక మహా సముద్రం!
సముద్రంలో ప్రవేశించడానికి ముందు నది భయంతో వణికిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసు కుంటుంది. తను దాటి వచ్చిన పర్వతాలూ, మైదానాలు, అడవులూ, గ్రామాలు కనిపిస్తాయి. ముందుకు చూస్తే అనం తమైన సముద్రం కండ్ల ముందుంటుంది. ఇంకొంచెం ముందుకుపోతే, ఇక అంతే- సముద్రంలో భాగమై పోవడమే. తప్పదు-వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉండదు. నదులు తమను తాము త్యాగం చేసుకోవాల్సిందే! కుల, మతాల, ప్రాంతీయ, జాతుల అస్తిత్వాన్ని కోల్పోవాల్సిందే! ఒక్కసారి మానవత్వపు సముద్రంలో కలిసిపోగానే భయం ఎగిరిపోతుంది సంకోచాలన్నీ ఇగిరిపోతాయి. ఆచార వ్యవహారాలన్నీ కరిగిపోతారు- సమానత్వం ఒక వైజ్ఞానిక భావన! ఏ నది ఏ దిశ నుండి వచ్చి కలుస్తే మాత్రం ఏమిటీ? హ్యూమన్ డిఎన్‌ఎ-అంతా ఒక్కటైనప్పుడూ? కంటికి కనిపించని డిఎన్‌ఏ-ఒక మహా సముద్రం. మానవ జాతి నదులన్నీ మానవత్వపు సంద్రంలో కలవక తప్పదు –
సముద్రమంటే సత్యం ! సముద్రమంటే జ్ఞానం!!
మానవ జీవితాలన్నీ నదులైతే,
మానవవాదం ఒక మహా సముద్రం –
ఇలా సింబాలిక్‌గా కాకుండా, నేరుగా సూటిగా చెప్పాడు ఉరుదూ కవి జఫర్ ఆజాద్
”జబ్ తక్ కరేగా యాద్ ఉస్ నాఖుదా కొ
ఆభిర్ కబ్ తక్ దేఖేగా ఏ తస్ వీరే
ఇంతెజార్ మె ఎ జిందగీ బర్‌బాద్ మత్‌కర్
తోడ్ దే సభీ ఉస్కే ఇష్క్‌కి జంజీరే-‘
(ఇంకా ఎంతకాలం దైవ విశ్వాసపు జ్ఞాపకాల్లో బతుకు నాశనం చేసుకుంటావూ
అతనితో ఉన్న అన్ని బంధనాల్ని తెంపేసుకో)
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు