– బీజేపీకి అవకాశం ఇవ్వొద్దు
– భువనగిరిలో జహంగీర్‌ను గెలిపిస్తే ప్రజల గొంతుకవుతాడు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-చౌటుప్పల్
మోడీ ప్రచార పర్యటనల్లో మోసపూరితమైన మాటలు చెబుతున్నారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని కోరారు. ఈ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా తమ ప్రచారం ప్రజల్లో అవసరమైన చైతన్యాన్ని పెంచుతుందన్నారు. సీపీఐ(ఎం) పోటీలో లేకుంటే బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్‌కు గొంతు లేకుండా పోతుందన్నారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. పోరాట చరిత్ర ఉండి లౌకిక శక్తులు బలంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీని అడ్డుకుంటామన్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. మత ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా అన్ని మతాల్లోని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. దీనిని బీజేపీ వక్రీకరించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మాయమాటలు చెబుతోందన్నారు. మతాల మధ్య మోడీ విభజన సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోతాయన్న భయాందోళన సృష్టించి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. మోడీ ఇప్పటి వరకు బీసీ కులగణన చేపట్టలేదన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. బడుగు, బలహీనవర్గాలు చైతన్యమై బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
రైతులకు గిట్టుబాటు ధర కావాలన్నా, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా పార్లమెంట్‌లో సీపీఐ(ఎం) సభ్యులు ఉండాలని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం, విద్యా చట్టం, సమాచార హక్కు చట్టంతోపాటు అనేక చట్టాలు సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే వచ్చాయని గుర్తు చేశారు. భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ. జహంగీర్‌ను గెలిపిస్తే.. పార్లమెంట్‌లో ప్రజల గొంతుకగా పాలకులను నిలదీసి మన హక్కులను సాధించుకోవచ్చని అన్నారు.
ఈ ప్రాంతానిది పోరాటాల చరిత్ర : చెరుపల్లి
ఈ ప్రాంతం పోరాటాల చరిత్ర కలిగి ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలుండగా భువనగిరిలో సీపీఐ(ఎం) పోటీ చేస్తోందన్నారు. భువనగిరి పార్లమెంట్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలాసార్లు కమ్యూనిస్టులు గెలిచిన చరిత్ర ఉందన్నారు. కమ్యూనిస్టులకు పట్టు కలిగిన ప్రాంతమన్నారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి పేదలకు భూ పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనన్నారు. ఎర్రజెండా లేని గ్రామాలు లేవని, ఎర్రజెండా తెలియని ప్రజలు లేరని అన్నారు. భువనగిరిలో పోటీచేసే అవకాశవాద పార్టీల అభ్యర్థులు ముగ్గురూ డబ్బు సంచులు తీసుకొని వస్తున్నారే తప్ప ప్రజలకు సేవ చేసే వారు కాదన్నారు. జహంగీర్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. నిజాయితీగా పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, నాయకులు గంగదేవి సైదులు, బూర్గు కష్ణారెడ్డి, ఎండీ.పాషా, గడ్డం వెంకటేశం, నందిపాటి మనోహర్, కీసరి నర్సిరెడ్డి పాల్గొన్నారు.