బీహార్‌లో 65% కు రిజర్వేషన్లు

In Bihar Reservations for 65%–  10 శాతం ఇడబ్ల్యుఎస్‌ కోటా అదనం: నితీష్‌ సర్కార్‌ నిర్ణయం
పాట్నా : రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇబిసి వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా, తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఆర్థికంగా బలహీన తరగతులకు (ఇడబ్ల్యూఎస్‌) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం రిజర్వేషన్లు దీనికి అదనం. బీహార్‌ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఒబిసి మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్‌ కులాలకు 20 శాతం, ఒబిసి, ఇబిసిలకు 43 శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఒబిసి, ఇబిసిలకు కలిపి 30 శాతం రిజర్వేషన్‌ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌టి) వారికి 2 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఇబిసిలకు 18 శాతం, ఒబిసిలకు 12 శాతం, ఎస్‌సిలకు 16 శాతం, ఎస్‌టిలకు ఒక శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
కులగణనకు సంబంధించిన నివేదికను బీహార్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఒబిసిల్లో యాదవులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14.27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బీహార్‌ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఇబిసిలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్‌సిలు, 1.7 శాతం ఎస్‌టీ జనాభా, జనరల్‌ కేటగిరిలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందినవారే ఉన్నారు.
సామాజిక, ఆర్థిక గణాంకాల విడుదల
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై గణాంకాలను బీహార్‌ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ గణాంకాలను సమర్పించింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్కడ 33.16 శాతం ఓబీసీలు, ఈబీసీలు 33శాతం మంది, 42.92 శాతం ఎస్సీలు, 42.7 శాతం ఎస్టీలు, 25.9 శాతం ఓసిలు పేదరికంలో ఉన్నట్టు స్పష్టమైంది. 34 శాతంమంది పేదలనీ, వారికి రూ.6,000ల కంటే తక్కువ నెల వారీ ఆదాయం వస్తున్నదని నివేదిక తెలిపింది. అలాగే 29శాతం మందికి పది వేల నుంచి రూ.50 వేల మధ్య ఆదాయం, 4శాతానికి మందే 50 వేల కంటే ఎక్కువ వస్తున్నదని పేర్కొంది.
ఓబీసీల్లో యాదవులు 35.8 శాతం, కుష్వాహా (34.3శాతం), కుర్మీ (29.9శాతం), బనియా (24.6 శాతం), మోమిన్‌ ముస్లిం (26.7శాతం), ధునియా ముస్లిం (31.4శాతం) బింద్‌ (44.1శాతం) పేదరికంలో ఉన్నారు. జనరల్‌ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్‌లు 27.58శాతం పేదరికంలో ఉన్నారు. 25.52 శాతం బ్రాహ్మణ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. 24.89శాతం రాజ్‌పుట్‌లు పేదరికంలో ఉన్నారు. కాయస్థులు అత్యంత సంపన్న సామాజికవర్గానికి చెందిన వారుగా నిలిచారు. రాష్ట్రంలో కేవలం 13.38శాతం కాయస్థులు మాత్రమే పేదరికంలో ఉన్నారు. ముస్లింలలోని షేక్‌, పఠాన్‌, సైయద్‌ల ఆర్థిక స్థితిగతులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. షేక్‌ సామాజిక వర్గానికి చెందిన వారిలో 25.84శాతం మంది పేదవారి కేటగిరిలో ఉన్నారు. పఠాన్‌ సామాజిక వర్గంలో 22.20శాతం కుటుంబాలు పేదరికంతో బాధపడుతున్నారు. 17.61శాతం సైయద్‌ కుటుంబాలు కూడా పేదరికంలో ఉన్నాయి. బీహార్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 2న సామాజిక వర్గాల వారీ జనగణన వివరాలను వెల్లడించింది. మంగళవారం సామాజిక, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.