– అభిప్రాయాలు స్వీకరించిన బీసీ కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు కోసం బీసీ కమిషన్ అభిప్రాయాలు, సలహాలు స్వీకరిం చింది. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ శనివారం హైదరాబాద్‌లో బీసీ మేధావుల సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించడంపై అభిప్రాయాలు, సలహాలను సేకరిం చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ల నిర్ధారణకు కుల సర్వే డేటా ప్రాతిపదికగా ఉండాలనీ, వారి జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించేందుకు, న్యాయ పరిశీలనను తట్టుకునేందుకు అధ్యయనంలో అడుగడుగునా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కుల సర్వే, సమాచార సేకరణ ప్రశ్నాపత్రం, ఎన్యూమరేటర్ల ఇంటి సందర్శన వివరాలు, సర్వే సమయంలో సరైన సమాచారం అందించాల్సిన ఆవశ్యకతపై విస్తత ప్రచారం ద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని సూచించారు. మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తామని కమిషన్ చైర్మెన్ జి.నిరంజన్ హామీ ఇచ్చారు. ప్రముఖులు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, జస్టిస్ చంద్ర కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, డాక్టర్ పి.వినరు కుమార్, ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి, టీపీసీసీ మేధావుల సెల్ అధ్యక్షులు ఎం.శ్యామ్ మోహన్, ప్రొఫెసర్ ఎం.బాగయ్య, డాక్టర్ షేక్ అబ్దుల్ ఘని తదితర ప్రముఖ మేధావులు ఈ సమావేశంలో పాల్గొని సూచనలు చేశారు.