– టాప్ 30 టైర్2 సిటీల్లో వెలవెల
– 3-61 శాతం వరకు క్షీణత
– విజయవాడ, వైజాగ్‌లోనూ అంతంతే
– ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ వెల్లడి
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
దేశంలోని ద్వితీయ శ్రేణీ నగరాల్లో నివాస అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుత ఏడాది జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఇండ్ల అమ్మకాలు 13 శాతం పతనమై 41,871 యూనిట్లుగా నమోదయ్యాయని ప్రాప్‌ఈక్విటీ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 47,985 యూనిట్ల ప్రాపర్టీల అమ్మకాలు జరిగాయి. కేవలం కోయంబత్తూరు, డెహ్రాడూన్‌లలో మాత్రం అమ్మకాలు వరుసగా 23 శాతం, 47 శాతం చొప్పున పెరిగాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన క్యూ3లో నూతన నిర్మాణాలు (లాంచ్) ఏకంగా 34 శాతం క్షీణించి.. 28,980 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇవి 2023 ఇదే క్యూ3లో 43,748 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. కేవలం డెహ్రాడూన్, భోపాల్, కోయంబత్తూరు తదితర 8 నగరాల్లో మాత్రం కొత్త నిర్మాణాలు సానుకూల వృద్థిని నమోదు చేశాయి. దేశంలో వెస్ట్ జోన్ మొత్తం అమ్మకాలలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్‌పూర్‌ల వాటా 71 శాతంగా ఉంది. కనెక్టివిటీ, మౌలిక వసతుల్లో వృద్థి ఉన్నప్పటికీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో టైర్-30 నగరాలు విఫలమయ్యాయని ట్రూ నార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఇఒ రోచక్ బక్షి పేర్కొన్నారు.
ఏపీలో రియాల్టీ దిగాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు నివాస అమ్మకాల్లో వెనుకబ డిపోయాయి. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో గుంటూర్‌లో విక్రయాలు 35 శాతం తగ్గి 242 యూనిట్లుగా, వైజాగ్‌లో 40 శాతం పతనమై 776 యూనిట్లుగా, విజయవాడలో 21 శాతం తగ్గి 440 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆయా నగరాల్లో వరుసగా గతేడాది ఇదే త్రైమాసికంలో 371 యూనిట్లు, 1296 యూనిట్లు, 557 యూనిట్ల చొప్పున అమ్మకాలు జరిగాయి. కొత్త లాంచ్‌లు వైజాగ్‌లో 87 శాతం క్షీణించి 350 యూనిట్లుగా, విజయవాడలో 69 శాతం పతనమై 150 యూనిట్లకు పరిమితమయ్యాయి.