– మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
– 16న సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి
– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కాప్రా
కేంద్ర ప్రభుత్వ మతతత్వ విధానాలను కార్మికులు, ప్రజలు ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల దగ్గరకు వెళ్ళి సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. సోమవారం హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఎపిరాకు మైనింగ్ ఇండియా కంపెనీ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతోందని, అయినా రైతాంగ, కార్మికవర్గ, ప్రజల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. మోసపూరిత విధానాలతో ఇంకా కాలం వెళ్లదీస్తోందన్నారు. గత 50 సంవత్సరాల కన్నా నిరుద్యోగం ఎక్కువగా పెరిగిందని, శ్రామికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోయాయని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. అధికారానికి రాకముందు ధరలను నియంత్రిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు విచ్చలవిడిగా ధరలు పెంచిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించకపోగా వాటిపై 243 శాతం పన్ను వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసులు, ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బివి. సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ చిన వీరయ్య, ఆఫీస్ బేరర్స్ కోదండరామ్, శివ, మల్లిఖార్జున్, గంప నారాయణ, పవన్, శ్రీనివాసు, శివప్రా క్రేన్స్ ప్రధాన కార్యదర్శి ఎండి.రసూల్ పాల్గొన్నారు.