– పుదుచ్చేరి రెండో ఇన్నింగ్స్ 171/2
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఏడాది రంజీ ట్రోఫీలో తొలి విజయంపై కన్నేసిన హైదరాబాద్‌కు పుదుచ్చేరి సవాల్ విసురుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలిన పుదుచ్చేరి ఫాలోఆన్‌లో అనూహ్యంగా ప్రతిఘటన చూపిస్తుంది. ఓపెనర్లు శ్రీధర్ రాజు (61 నాటౌట్), అజరు రోహెర (69) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించిన పుదుచ్చేరి.. హైదరాబాద్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. ఎనిమిది బౌలర్లు ప్రయత్నించినా.. 47 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే పడ్డాయి. లెఫ్టార్మ్ స్పిన్నర్ అనికెత్ రెడ్డి (5/11) ఐదు వికెట్ల ప్రదర్శనతో పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలోనే చేతులెత్తేసింది. హైదరాబాద్ 383 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. ప్రస్తుతం పుదుచ్చేరి మరో 212 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో కొనసాగుతుంది. నేడు ఆఖరు రోజు ఆటలో గెలుపే లక్ష్యంగా హైదరాబాద్ సిద్ధమవుతుంది.