– ఉప ముఖ్యమంత్రికి టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. గురుకుల సీఆర్టీ, కేజీబీవీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. అమానవీయంగా ఉన్న పనివేళలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. నెలలో రెండుసార్లు మాత్రమే రాత్రి విధులకు పరిమితం చేయాలని సూచించారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టళ్ల నిర్వహణకు పూర్తిస్థాయి వార్డెన్లను నియమించాలని కోరారు. ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసిన కేజీబీవీల్లో పనిచేసే ప్రత్యేక అధికారిణిలకు కనీసం రూ.పది వేల అలవెన్సును అదనంగా చెల్లించాలని తెలిపారు. కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలనీ, టైంస్కేల్ వర్తింపచేయాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బందికి, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సీఆర్పీలు, ఎంఐఎస్, సీసీవో, ఐఈఆర్పీ తదితర కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరోగ్య కార్డులివ్వాలనీ, పీఎఫ్, ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి భరోసా కల్పించాలని తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల అనధికార డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.