– సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాలి
– సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వారు చేస్తున్న సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు వారి సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగులు గత 45 ఏండ్లుగా ఐసీడీఎస్‌లో పనిచేస్తున్నారని వివరించారు. పేద ప్రజలకు వివిధరకాల సేవలందిస్తున్నారని తెలిపారు. వారందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద మహిళలని పేర్కొన్నారు. నేటికీ కనీస వేతనం, పెన్షన్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత వంటి చట్టబద్ధ సౌకర్యాలకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కర్నాటకలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. కేరళ, బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాయని వివరించారు. శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గతనెల 18న అంగన్‌వాడీ ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామంటూ నిర్ధిష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు రూ.లక్ష, మినీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పెన్షన్, ఈఎస్‌ఐ వంటి వాటికి సంబంధించి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేక సమ్మెకు దిగారని పేర్కొన్నారు. కావున అంగన్‌వాడీ ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ప్రధానమైన డిమాండ్ల పరిష్కారంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలనీ, సమ్మెను విరమింపజేయాలని కోరారు.
ప్రధానమైన డిమాండ్లు
అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి.
కనీస వేతనం రూ.26 వేలివ్వాలి.
పెన్షన్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలి.
ఉద్యోగ విరమణ సమయంలో టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ. ఐదు లక్షలు చెల్లించాలి.
రిటైర్మెంటు వయస్సును 60 ఏండ్లుగా నిర్ణయించాలి.
ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి.