నూతన అధ్యాపకులకు వేతనం చెల్లింపు సమస్య పరిష్కారం

– ట్రెజరీ డైరెక్టర్‌కు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కొత్తగా నియమించిన నూతన అధ్యాపకులకు సంబంధించిన వేతనం చెల్లింపు సమస్య పరిష్కారమైంది. డీటీవో, ఎస్టీవోల ద్వారా వారికి జీతాలివ్వాలంటూ ట్రెజరీ శాఖ డైరెక్టర్‌కు ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, మల్టీజోన్‌ 1, 2 ఆర్జేడీ జయప్రదబాయి గురువారం ఆదేశాలు జారీ చేశారు. డీటీవోలో, ఎస్టీవోలో వేతన బిల్లుల చెల్లింపుల్లో వారు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వెంటనే డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీ శాఖ నుంచి రాష్ట్రంలోని డీటీవో, ఎస్టీవోల కార్యాలయాలకు సమాచారం అందించి వారికి వేతనాలు త్వరగా ఇచ్చేటట్టు చూడాలని కోరారు. ఈ నిర్ణయం పట్ల జీసీఎల్‌ఏ-475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు.