– వివిధ రంగాల ప్రముఖులకు చనగాని దయాకర్ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరద బాధితులకు సహాయం అందించేందుకు సినీ ప్రముఖులు, విద్యా, వ్యాపార వేత్తలు వెంటనే స్పందించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు. రాష్టంలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాలకు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వెంటనే స్పందించి వరద బాధితులకు భరోసానిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్యానికి మద్దతుగా, ప్రజలకు సహాయంగా సినీ ప్రముఖులు కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు. కేరళలో వాయనాడ్ బాధితుల కోసం ఎంతో మంది ప్రముఖులు స్పందించారని గుర్తు చేశారు. అదే తరహాలో వ్యాపారవేత్తలు ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం చేయాలని కోరారు. వరద బాధితులకు సీఎం తక్షణ సహాయం కింద రూ.10వేలు ప్రకటించారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. దేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏనాడూ బాధితులను పరామర్శించలేదని విమర్శించారు.