– కేంద్రానికి ‘సుప్రీం’ నోటీస్
– సీఏఏ అమలుపై స్టే పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 9కి విచారణ వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలులోకి తెచ్చిన 2024 నాటి పౌరసత్వ (సవరణ) నిబంధనలపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసిచ్చింది. మూడు వారాల్లోగా పిటిషన్లకు వివరణివ్వాలని ఆదేశించింది. సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్, కేరళ ప్రభుత్వం, ఇతర సంఘాలు, వ్యక్తులు 236 పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల ఆ చట్టానికి చెందిన రూల్స్‌ను నోటిఫై చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయా పిటిషన్లలో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏప్రిల్ 2లోగా ఐదు పేజీలకు పరిమితం చేస్తూ సమాధానం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దానికి ఐదు పేజీల కౌంటర్‌ను ఏప్రిల్ 8లోగా దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం సీఏఏ అమలుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసు తదుపరి విచారణనను ఏప్రిల్ 9న వాయిదా వేసింది.
నాలుగేండ్ల తరువాత నిబంధనలను నోటిఫై చేయడమేంటీ?
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నాలుగు వారాల గడువు కోరారు. దీనిని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. ”స్టే దరఖాస్తుకు సమాధానానికి నాలుగు వారాలు చాలా ఎక్కువ. ఈ నిబంధనలు నాలుగేండ్ల తరువాత నోటిఫై చేశారు. 2020 నుండి ప్రతి మూడు నెలల తరువాత పార్లమెంటు నిర్వహించి, ఇప్పుడు నోటిఫై చేశారు. ఇప్పుడు పౌరసత్వం మంజూరు చేస్తే అప్పుడు దానిని తిప్పికొట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం పౌరసత్వం మంజూరు చేసిన తరువాత మీరు దానిని వెనక్కి తీసుకోలేరు” అని సిబల్ అన్నారు. సీఏఏ ఆమోదించిన దాదాపు నాలుగేండ్ల తరువాత అకస్మాత్తుగా నిబంధనలను నోటిఫై చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
”వారు చట్టబద్ధమైన నిబంధనలపై స్టే కోరుతున్నారు” అని సొలిసిటర్ జనరల్ అన్నారు. దీనికి కపిల్ సిబల్ స్పందిస్తూ ”నాలుగేండ్ల తరువాత అత్యవసరం ఏమిటి? మేము నోటిఫై చేయడం లేదని వారు గతంలో చెప్పారు” అని వాదించారు. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.
పెండింగ్‌లో ఉన్నందున పౌరసత్వాన్ని మంజూరు చేయొద్దు
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కూడా వాదనలు వినిపిస్తూ ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిబంధనల ప్రకారం ఎలాంటి పౌరసత్వాన్ని మంజూరు చేయకూడదని ప్రభుత్వానికి సూచిం చాలని వాదించారు. ”పౌరసత్వం మంజూరు చేయబడిందా? లేదా? పిటిషనర్లపై ప్రభావం చూపదు” అని సొలిసిటర్ జనరల్ బదులిచ్చారు. ”అది సమస్య కాదు. సమస్య దీనికి రాజ్యాంగబద్ధత” అని జైసింగ్ బదులిచ్చారు. దీంతో ఆమె తాత్కాలిక స్టే కోసం ఒత్తిడి తెచ్చారు.1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2ను సవరించారు. దాని ప్రకారమే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సి, క్రైస్తవ మైనార్టీలకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు.
అయితే పౌరసత్వం ప్రాతిపదికన ఇవ్వడంతో, మతపరమైన వివక్ష జరుగుతుందని పిటిషనర్ల వాదన. సీఏఏ రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు