– గాజాకు అండగా ప్రపంచ దేశాలు
– తక్షణమే దాడులు ఆపేయాలి
– గాజాకు సాయం పెంచాలి : ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభ తీర్మానం
– అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదం
– ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు
న్యూయార్క్ : ఇజ్రాయిల్, హమాస్ మధ్య తక్షణమే మానవతా సంధి కుదరాలని పిలుపిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ అత్యధిక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించింది. 22 అరబ్ దేశాల గ్రూపు ఈ తీర్మానాన్ని రూపొందించగా, 120-14ఓట్ల తేడాతో ఆమోదించారు. భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికా, ఇజ్రాయిల్‌లు వ్యతిరేకించాయి. ఓటింగ్‌కు ముందు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది మాట్లాడుతూ, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడమంటే అర్ధం లేని ఈ యుద్ధాన్ని, విచక్షణారహితమైన హత్యలను ఆమోదించడమేనని అన్నారు. కాగా ఇజ్రాయిల్ ఈ ఓటింగ్‌ను ‘అపఖ్యాతి’గా వ్యాఖ్యానించింది. అయితే జనరల్ అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానానికి తప్పనిసరిగా కట్టుబడి వుండాల్సిన అవసరం లేదు కానీ ప్రపంచ దేశాల అభిప్రాయానికి ఇదొక ప్రామాణికంగా పనిచేస్తుంది. ఇప్పటికి ఇజ్రాయిల్ యుద్ధం మొదలై మూడు వారాలు గడుస్తున్నా తగిన చర్యలు తీసుకోవడంలో భద్రతా మండలి విఫలం కావడంతో జనరల్ అసెంబ్లీ ఓటింగ్ జరిగింది. ఇతరులు మద్దతిచ్చిన ప్రతిపాదనలను నిలువరించడానికి అమెరికా, రష్యాలు వీటో అధికారాలను ఉపయోగించాయి. తక్షణమే, శాశ్వతమైన, సుస్థిరమైన మానవతా సంధి కుదుర్చుకుని ఘర్షణలు విరమించాలని తీర్మానం పిలుపిచ్చింది. పాలస్తీనియన్లను బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళగొట్టే ప్రయత్నాలను నిర్వ్దంద్వంగా తిరస్కరించింది. ఈ ఘర్షణలు విస్తృతంగా పెచ్చరిల్లకుండా చూడాల్సిన అవసరం వుందని తీర్మానం నొక్కి చెప్పింది. గాజాకు మానవతా సాయాన్ని మరింతగా పెంచాలని డిమాండ్ చేసింది. బందీలుగా వుంచిన పౌరులందరినీ తక్షణమే విడుదల చేయాలని తీర్మానం కోరింది. ఇజ్రాయిల్ పౌరులపై దాడులతో సహా అన్ని రూపాల్లోని తీవ్రవాద చర్యలను, విచక్షణారహిత దాడులన్నింటినీ ఖండించింది. హమాస్‌పై దాడులను తీర్మానంలో నిర్దిష్టంగా ప్రస్తావించలేదు. కాల్పుల విరమణ అంటే హమాస్‌కు తిరిగి ఆయుధాలు సమకూర్చుకోవడానికి సమయం ఇవ్వడమేనని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్ రాయబారి గిలాద్ ఎర్డాన్ వ్యాఖ్యానించారు. శాంతిని తీసుకురావడానికి ఈ ఓటింగ్ ఉద్దేశించబడలేదని, కేవలం ఇజ్రాయిల్ చేతులు కట్టివేయడానికేనని అన్నారు. అత్యసరం సమావేశంలో కాల్పుల విరమణ జరగాలని కోరుతూ పలువురు వక్తలు మాట్లాడారు.
బాంబు దాడులు ఆపండి
బాంబు దాడులను ఆపి, ప్రాణాలను కాపాడాలని పాలస్తీనా రాయబారి విజ్ఞప్తి చేశారు. జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. మరణించిన వారిలో 70శాతం మంది చిన్నారులు, మహిళలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యుద్ధాన్నా మీరు సమర్ధించేది? అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ నేరాలేనని అన్నారు. ఇదంతా ఆటవికమని విమర్శించారు. చనిపోయిన వారు చనిపోగా, మిగిలిన వారిని కాపాడేందుకైనా ఈ యుద్ధాన్ని ఆపాలని ఆయన కోరారు. హమాస్‌ను సమూలంగా నిర్మూలించేవరకు శాంతించేది లేదని ఇజ్రాయిల్ రాయబారి స్పష్టం చేశారు.