బాధ్యత మరిచారు

Responsibility is forgottenపిల్లలను చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలకు లేదా? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి ఆలనా పాలనా చూడాలి. విద్యాబుద్ధులు నేర్పించాలి. వారు జీవితంలో నిలదొక్కుకునేలా చూడాలి. ఇలా పిల్లల జీవితాలలో జరిగే అన్నీ విషయాల్లో తల్లిదండ్రులు గొప్ప పాత్ర పోషిస్తారు. అలాంటి తల్లిదండ్రుల వయసైపోయిన తర్వాత వారిని చూసుకోవడం పిల్లల బాధ్యత. కానీ ఆ బాధ్యతను మర్చిపోయి వాళ్లను రోడ్డున పడేస్తున్నారు. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
శాంతమ్మకు 62 ఏండ్లు. ఆమె భర్త శంకరయ్యకు 70 ఏండ్లు ఉంటాయి. ఇద్దరూ కలిసి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చారు. వాళ్లను చూసి మేము ‘సమస్య మీ అమ్మాయిదా? లేకపోతే మీ అబ్బాయిదా?’ అని అడిగితే ‘పిల్లల సమస్యలు మాత్రమే వింటారా? మా సమస్యలు వినరా, పరిష్కరించరా..?’ అంటూ తన బాధ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది శాంతమ్మ.
శంకరయ్యకు ఆమె రెండో భార్య. మొదటి భార్యకు ఓ కొడుకు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. వాళ్లు చిన్నగా ఉన్నప్పుడు మొదటి భార్య చనిపోతే శాంతమ్మను పెండ్లి చేసుకున్నాడు. అమెకు పిల్లలు లేరు. మొదటి భార్య పిల్లలనే తన పిల్లలుగా చూసుకుంది. వారిని పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్దులు నేర్పించింది. అందరికీ పెండ్లి చేసింది. కొడుకు పెండ్లి తర్వాత అత్తా కోడలికి పడటం లేదు. శాంతమ్మకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. కొడుకుతో వేరే కాపురం పెట్టించి ఇద్దరూ ఆ ఇంట్లోనే ఉండాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. దాంతో వీరిద్దరే చిన్న ఇల్లు కిరాయికి తీసుకుని ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు.
అయితే శాంతమ్మకు తల్లి తరపున కొంత పొలం వచ్చింది. దాన్ని అమ్మి పిల్లల చదువుకు, పెళ్లిళ్ళకు, ఖర్చు చేసింది. మిగిలిన 10 లక్షల్లో కొంత బంగారం చేయించుకుంది. కొడుకు ఇల్లు కట్టుకుంటానంటే అతనికి మూడు లక్షలిచ్చింది. మరో ఆరు లక్షలు ఇద్దరి పేరుతో బ్యాంకులో పెట్టాలనుకున్నారు. కానీ వారి రెండో అల్లుడు వంశీ ‘బ్యాంకులో వేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుందో అంత డబ్బు మీకునేనిస్తాను. నాకిప్పుడు డబ్బు అవసరం. వేరెవరికో వడ్డీ కట్టడం ఎందుకు? ఆ వడ్డీ మీకే ఇస్తాను’ అన్నాడు. దాంతో వంశీకి ఆ ఆరు లక్షలు ఇచ్చారు. అతను ప్రతి నెల రూ|| 12000/- శాంతమ్మ అకౌంట్లో వేస్తానన్నాడు. కొడుకు ఇల్లు కట్టించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదంటే వంశీ పది లక్షలు సహాయం చేశాడు. అందులో ఎనిమిది లక్షలు తిరిగి ఇచ్చేశాడు. ఇంకా రెండు లక్షలు ఇవ్వాలి. శాంతమ్మకు వంశీ బంగారు గాజులు, పుస్తెల తాడు చేయించి ఇచ్చాడు. మొత్తం కలిపి ఆరు తులాలు ఉంటుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా శాంతమ్మ, శంకరయ్యల వయసు పెరుగుతున్నకొద్దీ వంట్లో శక్తి తగ్గిపోతోంది. శంకరయ్యకు ఆరోగ్యం బాగోక కొడుకు దగ్గరకు వెళదామంటే శాంతమ్మ ఒప్పుకోలేదు. దాంతో వంశీ అత్తామామలను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ కూడా ఉండలేక పోయారు. ‘నువ్వు మా అమ్మవు కావు. మేము మా నాన్నను మాత్రమే చూసుకుంటాం’ అని కూతురు శంకరయ్యను మాత్రమే తనతో పెట్టుకుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో శాంతమ్మకు అర్థం కాలేదు. దిగులుతో మంచం పట్టింది. శాంతమ్మ చెల్లి భర్త వచ్చి తన ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆమె జీవితం మొత్తం శంకరయ్య కుటుంబానికే ధారపోసింది. చివరి దశలో ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. వంశీ దగ్గరున్న డబ్బు అడిగితే దానికి పంచాయితీ పెట్టారు. పెద్ద గొడవ అయ్యింది. తర్వాత శంకరయ్య కూడా శాంతమ్మ దగ్గరకు వచ్చేశాడు. ప్రస్తుతం బయటకు వెళ్ళి పని చేసే ఓపిక వారిలో లేదు. దాంతో శంకరయ్య వెళ్ళి వంశీని డబ్బులు అడిగితే ‘నా దగ్గర లేవు. ఉన్నప్పుడు ఇస్తాను’ అన్నాడు. దాంతో చేసేది లేక ఇంటికి తిరిగొచ్చాడు.
డబ్బులు ఇవ్వడం లేదని వంశీపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. వంశీవచ్చి ‘వాళ్లు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చినట్టు ఏమైనా రుజువుంటే చూపించండి ఇస్తాను’ అన్నాడు. కానీ వీరి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి పోలీసులు కూడా ఏమీ చేయలేక పోయారు. దాంతో లాయర్‌ దగ్గరకు వెళ్లారు. అక్కడ కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. శాంతమ్మ, శంకరయ్యల పరిస్థితి అసలేం బాగోలేదు. దాంతో వంశీ లక్ష రూపాయలు మాత్రమే ఇస్తానన్నాడు. దానికి శాంతమ్మ ఒప్పుకోలేదు. మళ్లీ వాళ్ల కమ్యూనిటీలో పంచాయితీ పెట్టారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయే సరికి ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చి వంశీ నుండి డబ్బులు ఇప్పించమని కోరారు.
మేము వంశీకి ఫోన్‌ చేసి ఐద్వా ఆఫీస్‌కు పిలిపించాము. అతను మొదట ‘నాకు డబ్బులు ఇచ్చినట్టు వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటప్పుడు డబ్బులు నేనెందుకు ఇవ్వాలి. పైగా అవి మా మామయ్య డబ్బులు. అలాంటప్పుడు శాంతమ్మకు ఎందుకివ్వాలి? మా మామయ్యకే ఇస్తా. డబ్బులు ఆమె చేతికిస్తే డబ్బు తీసుకొని వెళ్లిపోతుంది. ఇక మా మామయ్య పరిస్థితి ఏంటీ? నా పరిస్థితి బాగోలేక మూడు నెలలు వడ్డీ ఇవ్వక పోతే ఇంత గొడవ చేస్తారా? పోలీస్‌ స్టేషన్‌లో, పంచాయితీలో నా పరువు పోయింది. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తా. మరి నా పరువు తిరిగి వస్తుందా? అలాంటప్పుడు నేనెందుకు ఇవ్వాలి? శాంతమ్మకు నేను ఆరు తులాల బంగారం ఇచ్చాను. దానికి డబ్బులు కూడా తీసుకోలేదు. తులం 60 వేలు అనుకున్నా మూడు లక్షల 60వేల బంగారం ఇచ్చాను. వారి దగ్గర తీసుకున్న డబ్బులకు వడ్డీతో కలిపి నెలకు పది వేలు అదనంగా ఇచ్చాను. లెక్క చూసుకుంటే వాళ్ళే నాకు తిరిగి ఇవ్వాలి’ అన్నాడు.
అంతా విన్న మేము ‘ఆ డబ్బులు శంకరయ్యవి కావు, శాంతమ్మ పొలం అమ్మితే వచ్చిన డబ్బులు. కాబట్టి మీరు తిరిగి ఇవ్వాల్సిందే’ అని చెప్పాం. దానికి మొదట అతను ఒప్పుకోలేదు. ‘వాళ్ళకు అండ లేదనుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ వయసులో ఇబ్బంది పెడుతున్నారు. అయినా వాళ్ళేమీ మీ అందరిపై ఆధారపడి లేరు. వాళ్ల డబ్బు ఇచ్చేస్తే వాళ్ల బతుకు వాళ్లు బతుకుతారు. లేదంటే పరిస్థితి మరోలా వుంటుంది’ అని గట్టిగా హెచ్చరించాము. దాంతో ‘ఇప్పుడు అంత డబ్బు నా దగ్గర లేదు. కొంచెం కొంచెం ఇస్తాను’ అన్నాడు. అన్నట్టుగానే రెండు దఫాలుగా నాలుగు లక్షల చొప్పున తిరిగిచ్చాడు. వాటిని శాంతమ్మ, శంకరయ్యల పేరు మీద పోస్టాఫీసులో వేసి ప్రతి నెలా వడ్డీ వారి ఖాతాలోకి వచ్చేలా చేశాం. అలాగే కొడుకుతో మాట్లాడి ప్రతి నెల కొంత డబ్బులు ఇచ్చేలా చేశాము. ఇప్పుడు వారిద్దరూ చాలా సంతోషంగా వున్నారు. తల్లిదం డ్రులను చూసుకోవడం పిల్లలు తమ బాధ్యత అని గుర్తించాలి. లేదంటే మలివయసులో వారి పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారుతుంది.

– వై వరలక్ష్మి, 9948794051