నాణ్యతమైన విద్య అందించాల్సి బాధ్యత..

Responsibility to provide quality education.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే..
– యాద్రాద్రి జిల్లా టీఎస్‌ యూటీఎఫ్‌ సభలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్‌(ఎం)
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూర్‌(ఎం) మండల కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎస్‌టీఎఫ్‌ఐ పతాకాన్ని సీనియర్‌ నాయకులు పోరాల యాదగిరి, దడిపెల్లి వెంకన్న కలిసి ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బడి లేకుంటే సామాజిక అంతరాలు పెరిగి సమాజ విచ్ఛిన్నానికి దారితీస్తాయన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు ఆటంకంగా ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీలను పాఠశాలకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని తెలిపారు. టీఎస్‌ యూటీఎఫ్‌ మొదటి నుంచి ఉపాధ్యాయ సమస్యల పట్ల నిక్కచ్ఛిగా పోరాడుతుందని, నేడు వారు పొందుతున్న అనేక సౌకర్యాలు టీఎస్‌ యూటీఎఫ్‌ పోరాటాల ఫలితమేనని చెప్పారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్‌.రాములు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పదేండ్లుగా విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానం 2020 శాస్త్రీయవిద్యను దూరం చేసి అశాస్త్రీయతను పెంపొందించేలా ఉన్నదని విమర్శించారు. వెంటనే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సభలో.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వలిగొండ మండల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేసీహెచ్‌.రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేపీ కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు జి.నాగమణి, ఎం.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు మిరియాల దామోదర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కట్ట రమేశ్‌, నల్గొండ జిల్లా అధ్యక్షులు వై.సైదులు, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.అనిల్‌కుమార్‌, సంఘం మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.