ఎగుమతులపై ఆంక్షలు!

Restrictions on exports!మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పంటల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో పంటల దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతూ ఆహార పంటల ఎగుమతులను ఒక్కొక్కటీ నిషేధించుకుంటూ వస్తోంది. ఇప్పటికే కార్పొరేట్‌ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాబోవు కాలంలో చిన్న రైతులు వ్యవసాయం నుంచి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. తాజాగా ఎగుమతుల నిషేధం కోసం పన్నుల పేరిట పలు ఆంక్షలు పెడుతూ రైతుల నోట్లో మన్ను కొడుతోంది. ఈ ఏడాది గోధుమ పిండి, మైదా, గోధుమ రవ్వ ఎగుమతులను కేంద్రం నిషేధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై పూర్తిగా బ్యాన్‌ పెట్టేసింది. అంతకు ముందే గోధుమల ఎగుమతులపైనా నిషేధం పెట్టింది. తాజాగా ఎగుమతి నిషేధాల జాబితాలో పంచదార వంతు వచ్చింది. దీనిపై ఒక జాతీయ మీడియాలో వార్తలు, అనేకమంది ఆర్థికవేత్తల విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటివరకు దానిని ఖండిస్తూ కేంద్రప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న ఆంక్షలన్నింటినీ సడలిస్తామని, ఎలాంటి పరిమితులు విధించబోమంటూ 2018లో కేంద్రం ఎగుమతి దిగుమతి విధానంలో పేర్కొన్నది. నాడు చెప్పిన మాటలను అటకెక్కించి నేడు ఎగుమతులపై బ్యాన్‌ పెట్టడం వెనుక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు దాగున్నాయని జరుగుతున్న పరిణామాలను చూస్తే స్పష్టమవుతోంది. దీంతో కేంద్రం నుంచి ఎప్పుడేం వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలలో లబ్ది కోసం ధరల అంశాన్ని ముందుకుతెచ్చి ఎగుమతులను లేకుండా చేస్తే మన రైతుల పరిస్థితేంటి? ఈ నిర్ణయాల వల్ల రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లభించడం కష్టమవుతుంది. ధరలు పెరగడానికి ప్రభుత్వ విధానాలే అయితే… దానికి మూల్యం చెల్లించాలన్నమాట. ఇదేమి న్యాయం? రైతుల నడ్డి విరగ్గొట్టి, ఎగుమతులపై బ్యాన్‌ పెట్టేస్తే ధరలు అదుపులో ఉంటాయని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వగలదా?
గడిచిన తొమ్మిదేండ్ల మోడీ పాలనలో ఒకటి స్పష్టం. ఈ ప్రభుత్వానికి పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద, ప్రేమ ఇతర ఏ వర్గాల మీద లేదు. పెద్ద పెద్ద వ్యాపారులకు ఇచ్చిన రాయితీలు, రద్దు చేసిన రుణాలు రైతులకు లేవు. ఇప్పటి వరకు పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు, పరిమితులు మాత్రమే విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిషేధం విధిస్తే ఆ రైతులు ఎక్కడికి పోవాలి. సెప్టెంబరు 30వ తేదీ వరకు 61లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం మిల్లులకు అనుమతి ఇచ్చింది. అయితే, అక్టోబరు ఒకటవ తేదీ నుంచి చెరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న క్రమంలో పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తుందా? అన్నది ప్రశ్న.
ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే భారతదేశం ప్రపంచదేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని మోడీ గొప్పలు చెప్పారు. ఇప్పుడేమో ఎగుమతులపై నిషేధాలు విధిస్తున్నారు. అంతెందుకు ఇండోనేషియా, మొరాకో, టర్కీ, థాయిలాండ్‌, వియత్నాం వంటి దేశాలకు 20లక్షల టన్నుల నుంచి కోటి టన్నుల గోధుమలను పంపేలా ఏర్పాట్లు చేస్తామని కేంద్రం ప్రకటించిన మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఉల్లి ధరల పెరుగుదల సూచన కనిపించటంతో వాటి ఎగుమతులపై నలభై శాతం పన్ను ప్రకటించింది. ధరలు పెరిగినప్పుడు వాటిని కొనకుండా..వాడకుండా ఉంటే ధరలు పెరగబోవని చెప్పిన నేతలు వీరు..! ఒకప్పుడు ఉల్లి ధరలను ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చిన గతం బీజేపీకి గుర్తుకొచ్చిందో ఏమో… ఎప్పుడూ లేనిది గ్యాస్‌ ధరలు తగ్గించడం, ఎగుమతులపై నిషేధం పెట్టడం వంటి చర్యలకు పూనుకుంటున్నది. ఇదంతా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ధరలను తగ్గించామని జనం ముందు చెప్పుకుని బయటపడే తాపత్రయమే కనిపిస్తోంది. ఎగుమతులు నిషేధిస్తే రైతులేమైపోతారోనన్న ధ్యాస మాత్రం లేనేలేదు. ఎగుమతుల రద్దును అవకాశంగా తీసుకొని కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచిన అనుభవాలు అనేకం. ఇప్పుడు కూడా ఏరుదాటాక తెప్ప తగలెయ్యరనే గ్యారంటీ ఏమీ లేదు! అయినా వారికేం… అవస్థలు పడేది పేద, మధ్యతరగతి జనమే కదా…