– ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సుల సంఖ్య పెంచాలి
– కార్మికులకు రెండు పే స్కేల్స్ అరియర్స్‌తో సహా ఇవ్వాలి : రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తివేసి, ప్రజాస్వామ్య పద్దతిని పునరుద్ధరించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు వీరాంజనేయులు నాయకత్వంలో ఆఫీస్ బేరర్స్ ఏవీ రావు, పీ రవీందర్‌రెడ్డి, గంగాధర్, కేఎస్ రెడ్డి, కే గీత, ఎస్ కృష్ణ తదితరులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. 2014 నుంచి 2023 వరకు సంస్థలో బస్సుల సంఖ్య, రూట్లు, షెడ్యూల్స్ సహా ఇతర అనేక అంశాల్లో తగ్గుదలను పట్టిక రూపంలో మంత్రికి అందచేశారు. ఆర్టీసీని లాభనష్టాల ప్రాతిపదికన కాకుండా, ప్రజారవాణా సంస్థగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 26 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. సంస్థ ఆస్తులు, అప్పులు, అసెంబ్లీలో ఇచ్చిన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మి కులకు రావల్సిన రెండు వేతన సవరణల్ని బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. ఆర్టీసీ ప్రతిష్టను పెంచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు.