‘ఢిల్లీ చలో’ పున:ప్రారంభం

'Delhi Chalo' Relaunch– టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ఎదుర్కొనేందుకు ఇనుప కవచాలు
– జనపనార బస్తాలతో బారికేడ్లు
– ఇనుప చువ్వలను తొలగించే ప్రత్యేక సామాగ్రి
– భారీ సమీకరణ, సన్నాహాలతో సిద్ధమైన రైతులు
– ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించి ఎంఎస్‌పీ చేయాలని డిమాండ్‌
– 177 సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసిన కేంద్రం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ సరిహద్దులో రైతుల పోరాటం ఉధృతమవుతున్నది. మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని పాత ఎంఎస్‌పీకి కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు తమ నిరసనలను బుధవారం తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులు ప్రయోగించే టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ఎదుర్కొనేందుకు ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో శంభు సరిహద్దులో పంజాబ్‌, హర్యానా రైతులు భారీగా చేరుకున్నారు. అలాగే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లు, ఇనుప చువ్వలను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలను కూడా సిద్ధం చేశారు. పోలీసులు తమ పోరాటానికి అడ్డుతగులుతారని భావించిన రైతులు ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో జర్నలిస్టులకు అధికారులు ఐడీ కార్డులు జారీ చేశారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. ”మాపై బలప్రయోగం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేం శాంతియుతంగా నిరసన తెలియచే యాలనుకుంటున్నాం” అని రైతులు అన్నారు. ఫిబ్రవరి 21 (బుధవారం)న ఉదయం 11 గంటలకు ‘చలో ఢిల్లీ’ పాదయాత్ర సాగుతుందని రైతు నేతలు ప్రకటించారు.
పంజాబ్‌ గ్రామాల నుంచి భారీ జన సమీకరణ
ఫిబ్రవరి 21న ‘డిల్లీ చలో’ మార్చ్‌కు ముందు, తమ డిమాండ్ల కోసం శంభు సరిహద్దుకు చేరుకుని తమతో కలిసి ఢిల్లీకి పాదయాత్ర చేయాలని మద్దతుదారులను కోరుతూ రైతు సంఘాలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాయి. శంభు వద్ద ఆందోళనలో వేలాది మంది రైతులు చేరడంతో మంగళవారం సాయంత్రం నాటికి సంఖ్య భారీగా పెరిగింది.
ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది
”ప్రభుత్వం సమస్యను ఆలస్యం చేస్తోంది. మొత్తం 23 పంటలపై ఎంఎస్‌పీ గురించి రాతపూర్వక హామీ అందించకపోతే, మేం ఆందోళన చేయడం తప్ప వేరే మార్గం లేదు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ప్రభుత్వం పంటల ధరలను నిర్ణయించాలి” అని భారతీ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా సిద్ధూపూర్‌) చీఫ్‌ జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ అన్నారు.
ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని నిర్వహించి ఎంఎస్‌పీ చట్టం చేయాలి
ఒకరోజు పార్లమెంట్‌ సమావేశాన్ని నిర్వహించి, ఎంఎస్‌పీ హామీపై చట్టం తీసుకురావాలని రైతు నాయకుడు సర్వన్‌సింగ్‌ పంధేర్‌ కేంద్రాన్ని కోరారు. ”కార్పొరేట్‌ లాబీ ఎంఎస్‌పీ చట్టాన్ని ఎప్పటికీ అనుమతించదు.
ఈ చట్టం వస్తే మన వ్యవసాయం, మండీలపై కత్తి కట్టడం శాశ్వతంగా పోతుంది” అని ఆయన అన్నారు. ”సి2 ప్లస్‌ 50 శాతం ఫార్ములా కూడా చేయదగినదే. కేంద్రం రుణమాఫీ కూడా ప్రకటించాలి. బ్యాంకులు ఆదేశిస్తే వెంటనే ఎంత అప్పు ఉందో చెబుతాయి” అని అన్నారు.
177 సోషల్‌ మీడియా ఖాతాలను, లింక్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం
రైతుల ‘ఢిల్లీ చలో’ పిలుపు నేపథ్యంలో 177 సోషల్‌ మీడియా ఖాతాలు, రైతుల ఆందోళనలతో అనుబంధం ఉన్న లింక్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించింది. ”పబ్లిక్‌ ఆర్డర్‌” నిర్వహించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ అత్యవసర నిషేధ ఆదేశాలను జారీ చేసింది. హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత వారం చేసిన అభ్యర్థన మేరకు మంగళవారం ఈ ఉత్తర్వులు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.