పదవీ విరమణ పొందిన ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలు ఊకే నాగమణి కి ఉపాధ్యాయ బృందం ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా నాగమణి పదవీ విరమణ పొందిన నేపథ్యంలో వారికి శుక్రవారం పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో చాలా కాలం పని చేసి విద్యార్థులకు సేవలందించారని అన్నారు. అంకిత భావంతో పనిచేసే విద్యార్థుల పాఠశాల ప్రగతికి కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందంగా ఉందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు పదవి విరమణ పొంది వెళ్లడం బాధగా ఉన్నప్పటికీ, ఉద్యోగ నిర్వహణలో తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం ఐటిడిఏ డిడి పోచం, స్థానిక డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.