విరమణ

విరమణచాలా విషయాల్లో ఇక చాలు అని భావించడం వివేకవంతుల లక్షణం. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతల వంటి వృత్తిపరమైన సందర్భాల్లో, సృజనాత్మక ప్రక్రియలకు చెందిన ప్రవృత్తి విషయంలో విరమణను ఒక మజిలీగా స్వీకరించాలి. అప్పుడు మనసులో ఎటువంటి ఘర్షణకు తావుండదు. జీవితాన్ని యథాతథంగా అంగీకరించే వారు మాత్రమే అలా చేయగలుగుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ తరహా వ్యక్తిత్వం ఎవరికైనా రాత్రికి రాత్రే పుట్టుకురాదు. జీవన వాస్తవికతను క్రమంగా జీర్ణించుకుంటే చివరకు ఆ పరిపక్వత దానంతట అదే వచ్చేస్తుంది.
ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా కూర్చుంటే మనసు భరించలేదు. ఇంత కాలం శ్రమించాం కదా… ఇక విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా… కొద్ది రోజులు మాత్రమే ఉండగలరు. తర్వాత కచ్చితంగా బోర్‌ కొడుతుంది. అయితే జీవితంలోని వాస్తవాలను అంగీకరించిన వారికి బోర్‌ అనేదే ఉండదు. నిత్యం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా గడుపుతుంటారు. గతంలో ఆపేసిన తమ ఆనందాలను తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంటారు.
కొందరు విరమణ తర్వాత సమయం ఎలా గడపాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వృత్తి, ఉద్యోగంలోనే ఇంత కాలం గడిచిపోయింది కదా… ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం ఇప్పుడు లభించిందనుకోవాలి. దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలి. చరిత్ర, సంస్కృతి, సంఘటనలు, జీవిత చరిత్రలు, సామాజిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం ఇలా అంశాలు ఏవైనా అధ్యయనం చేసేందుకు ఇది మంచి సమయం. మీకు ఆసక్తి వున్న రంగాన్ని ఎంచుకుని, ప్రశాంతతను ఇచ్చే పుస్తకాలను వెతుక్కొని చదవడం మొదలుపెట్టండి. పుస్తక పఠనం ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు పుస్తకాలు ఆడియో రూపంలో కూడా వస్తున్నాయి.
మీరు చూడాలనుకున్న, తెలుసుకోవాలనుకున్న అంశాలు ఎన్నో పెండింగ్‌లో ఉండిపోయి ఉంటాయి. అందువల్ల పదవీ విరమణ అనంతరం ఇష్టమైన సినిమాలు, డాక్యుమెంటరీ, వెబ్‌ సిరీస్‌ చూడొచ్చు. అయితే ఏవి చూడాలన్న గందరగోళం మాత్రం అస్సలు వద్దు. మీ అభిరుచిని బట్టి మీకు సిఫారసు చేయడానికి ఓటీటీ ప్లే వంటి యాప్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ట్రావెలింగ్‌ అందరికీ ఇష్టమే. కానీ ఉద్యోగ జీవితంలో మీకు సెలవులు దొరకడం కష్టమే. అందుకే ఉద్యోగ విరమణ తర్వాత మీకు నచ్చిన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఎప్పటి నుంచో సందర్శించాలనుకున్న ప్రదేశాలను ఎంచుకుని సరిగ్గా ప్లాన్‌ చేసుకోండి.
ప్రస్తుత జీవనశైలిలో కల్తీలు, పురుగు మందుల బారిన పడి సరైన జీవితాన్ని అనుభవించడం లేదన్న ఫీలింగ్‌ అందరిలోనూ ఉంది. అందువల్ల ఆర్గానిక్‌ పద్ధతుల్లో కూరగాయలు, పూల మొక్కలు పెంచడం వంటి వాటిపై దృష్టి పెట్టండి. ప్రకృతిలో జీవిస్తే మనసు చాలా ఆహ్లాదరకరంగా మారుతుంది. చిన్నప్పటి నుండి ఒక కుక్క పిల్లనో, పిల్లినో పెంచుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ బిజీ ప్రపంచంలో అది ఇప్పటి వరకు సాధ్యపడి ఉండకపోవచ్చు. పెంపుడు జంతువులతో స్నేహం కచ్చితంగా మీ జీవన శైలిని మెరుగుపరుస్తుంది. మీ వృత్తిపరమైన, ఉద్యోగపరమైన అనుభవాలతో పుస్తక రచన చేయొచ్చు. లేదంటే యూట్యూబ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బోధించవచ్చు. మీ అనుభవాలు ఆయా రంగాల్లోని వారికి ఉపయోగపడవచ్చు. ఇప్పటి వరకు కుటుంబం కోసం శ్రమించారు కనుక కొంత సమయాన్ని సమాజం కొరకు కూడా వినియోగించండి.