ఇక అంగన్వాడీల రిటైర్మెంట్..

– కసరత్తుచేస్తున్న ప్రభుత్వం
– వివరాలు సేకరించే పనిలో నిమగ్నం
– జిల్లాలో 65ఏళ్లు దాటినవారు 276 మంది
–  ఉద్యోగ విరమణతో మరిన్ని ఖాళీలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 65 ఏళ్లు పైబడిన వారి వివరాలను సేకరిస్తుంది. అయితే గత నెల 30న వారు ఉద్యోగ విరమణ చేస్తారని ఆ శాఖ నిర్ణయించినప్పటికీ ఎన్నికల నేపథ్యం లో దీన్ని పొడిగించింది. ఈ నెల చివరి వరకు, వచ్చే నెలలోనైనా వీరి ఉద్యోగ విరమణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చాలా మంది అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు రిటైర్మెంట్ కానున్నారు. వయస్సు పైబడడంతో వీరు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లబ్దిదారులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నట్లు తెలుస్తోంది. వయస్సు పైబడిన టీచర్లు, ఆయాల కుటుంబీకులు కొన్నిచోట్ల విధులు నిర్వహిస్తుండ గా, ఇంకొంత మంది వేరే వారితో ఆ పనులు చేయిస్తున్నారు. కొన్నేళ్లుగా అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడం లేదు. దీంతో ఖాళీలతో లబ్ధి దారులు అవస్థలు పడుతున్నారు. వీరు రిటైర్మెంట్ అయితే మరికొన్ని పోస్టులు ఖాళీ కానున్నాయి.
వివరాల సేకరణలో..
అంగన్వాడీల రిటైర్మెంట్ ప్రక్రియకు సంబంధించి ఆ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పరిధిలో ఎంత మంది ఏ వయస్సు వారు ఉన్నారు.. పుట్టిన తేది తదితర వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే జిల్లాలో 65 ఏళ్ల పైబడిన అంగన్వాడీ టీచర్లు 53, ఆయాలు 223 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు పుట్టిన తేదీ లేని వారిని ప్రభుత్వ ఆస్పత్రికి వయస్సు నిర్ధారణ కోసం పంపనున్నారు. మొత్తం దాదాపు 276 కు పైగా టీచర్లు, ఆయాలు  రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఇందు లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలను కూడా రిటై ర్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బెన్ఫిట్లపై అనాసక్తి..
రిటైర్మెంట్ పొందిన అంగనవాడి టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం సరిగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ  ప్రభుత్వం నామమాత్రంగా ప్యాకేజీ ఇస్తుందని చెబుతున్నారు. అంగన్వాడీ టీచర్ కు  రూ.2లక్షలు, ఆయాకు రూ.1లక్ష ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, టీచర్ కు  రూ.1లక్ష, ఆయాకు రూ.50వేల వరకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తు న్నట్లు సమాచారం. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆసరా పింఛన్ కూడా ఇవ్వాలని పేర్కొంటున్నారు. దీనిపై ఇంకా పూర్తిగా నిర్ధారణ రాకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు.
పెరగనున్న ఖాళీలు..
జిల్లాలో ఐసీడీఎస్ పరిధిలో 9 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల లోపు చిన్నారులు 44320 మంది, మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులు 23908 ఉన్నారు. మొత్తం 68228 మంది చిన్నారులు, 9308 వేల మంది గర్భిణీలు, 8454 మంది  బాలింతలు  ఉన్నారు. వీరందరికి ప్రతిరోజు ఆరోగ్యలక్ష్మి ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటికే ఖాళీలతో లబ్ది లబ్దిదారులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లాలో 82 మంది టీచర్లు, 350 మంది ఆయాలఖాళీలు ఉన్నాయి.కొన్ని కేం ద్రాల్లో టీచర్లు ఉంటే ఆయాలు లేరు.. మరికొన్ని కేంద్రాల్లో టీచర్లు లేకుండా ఆయాలే సెంటర్లు నడు పుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ విరమణ ప్రకటిస్తే జిల్లాలో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. అయితే వీరి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగులకు మేలు చేకూరనుంది.
ఎన్నికల కోడ్ అయిపోగానే..సక్కుబాయి – (ఐసీడీఎస్ పీడీ, నల్లగొండ )
65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ఎన్నికల కోడ్ అయిపోగానే ప్రభుత్వం నుండి వారికి బెనిఫిట్స్ అందుతాయి. స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, అంతేకాకుండా ఫీల్డ్ లో  చూసినప్పుడు నడవలేని స్థితిలో ఉన్న వారిని చూసి నిర్ధారిస్తున్నాం. పుట్టిన తేదీ సరిచేయాలని సీడీపీఓ ల నుండి ఏలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ వయస్సు నిర్ధారణ చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి పంపేలా చర్యలు చేపడతాం.