– ఆయన సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారారు : బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. సీఎం సోదరులు రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాసయాదవ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు తదితరులతో కలిసి సుమన్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి ఎలాంటి హోదా లేకున్నా వికారాబాద్ అభివృద్ధిపై ఇటీవల అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. కొడంగల్‌లో ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారని తెలిపారు. సీఎం మరో సోదరుడు కొండల్‌రెడ్డి అధికారులతో కలిసి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారని చెప్పారు. ఆయనకు ప్రభుత్వంలో ఎలాంటి హోదా, అధికారం ఉందని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇటీవల స్వచ్ఛ బయో కంపెనీతో ప్రభుత్వం తరపున రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారనీ, అయితే ఆ కంపెనీ ఆయన మరో సోదరుడు ఎనుముల జగదీశ్‌రెడ్డికి చెందిందని వివరించారు. కేవలం పది రోజుల క్రితమే ఆ కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదేగాకుండా రేవంత్ సోదరుల ఆధ్వర్యంలో మరో నాలుగు సంస్థలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. వాటి ద్వారానే సీఎం తన నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి అరాచకాలపై రాష్ట్రంలోని మేధావులు, బుద్ధిజీవులు స్పందించాలని సుమన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల కోసం కొట్లాడేది తమ పార్టీయేనని సుమన్ స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీపై వేల సంఖ్యలో ఫిర్యాదులు
-బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీపై వేల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించి తమ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేస్తే దాదాపు 3,500 ఫోన్ కాల్స్, 40 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని వారు చెప్పారు. వీటిని బట్టే రైతు రుణమాఫీ పరిస్థితేంటో విదితమవుతున్నదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్ మాట్లాడుతూ…రుణమాఫీకి, రేషన్ కార్డుకు లంకె పెట్టటం లేదంటూ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అదే జరుగుతోందని అన్నారు. ఆధార్ కార్డులో చిన్న తప్పు దొర్లినా దాన్ని సాకుగా చూపి రుణమాఫీ చేయటం లేదని వాపోయారు. వీసా ఉందనీ, భూ రికార్డులు సరిగా లేవనే రకరకాల కారణాలతో పథకాన్ని వర్తింపజేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు రైతు రుణమాఫీపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాము లేవనెత్తిన అంశాలన్నింటిపై క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.