కేసీఆర్‌ ఆటలో రేవంత్‌, హరీశ్‌రావు బలిపశువులు

– సీఎం పదవి కోసం కొట్టుకుంటున్న హరీశ్‌, కేటీఆర్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ ఆడుతున్న రాజకీయ చదరంగంలో రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు బలిపశువులు కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ దగ్గర హరీశ్‌రావు, కేటీఆర్‌ చర్చిస్తున్నారనే వార్త పెద్ద డ్రామా అనీ, వారిద్దరూ సీఎం పదవి కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సమక్షంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌, మాజీ జడ్పీటీసీ జోగిరెడ్డి, మాజీ కల్నల్‌ భిక్షపతి ముదిరాజ్‌, పరిగి నియోజకవర్గానికి చెందిన వన్నె ఈశ్వరప్ప, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆమోద ముద్ర పడకపోవడం వల్లనే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇంకా ఫైనల్‌ కాలేదని ఆరోపించారు.
అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి ప్రచారం చేసుకుంటున్న పరిస్థితిలో బీఆర్‌ఎస్‌ ఉందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో అందరమూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామనీ, ఇప్పటికే తమ లిస్టు జాతీయ నాయకత్వం వద్దకు వెళ్లిందని చెప్పారు. కాంగ్రెస్‌ లిస్ట్‌ మాత్రం ఇంకా ప్రగతి భవన్‌లోనే ఉందనీ, కేసీఆర్‌ 30 మంది అభ్యర్థుల పేర్లు నిర్ణయించి స్టాంఫు వేసిన తర్వాతనే ఢిల్లీకి పోతుందనే విషయం రేవంత్‌రెడ్డికి తెల్వదని అన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారబోతున్నా యన్నారు. కాంగ్రెస్‌ కూడా కుటుంబ పార్టీ అనీ, ఎమ్మెల్యేలు అమ్ముకునే పార్టీని అని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను ఇష్టానుసారంగా పెంచి ప్రజల రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బెల్లు షాపులను రద్దు చేస్తామని చెప్పారు.
ప్రజా ధనాన్ని దోచుకున్న వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..కేసీఆర్‌ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారనీ, మానకొండూరులో బీజేపీ గెలవడం ఖాయమని చెప్పారు. ప్రజలనే కాదు అధికారులను కూడా నమ్మలేని నైరాశ్య స్థితిలోకి కేసీఆర్‌ వెళ్లారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ఒక్కొక్క నియోజక వర్గంలో 30 నుంచి 100కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు లేదన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే కులగణన పేరుతో కాంగ్రెస్‌ ముసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు.