– తక్షణావసరాలకు నిధులు కరువు
– రైతుబంధుకు డబ్బుల్లేవు !?
– తలపట్టుకున్న ఆర్థికశాఖ అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సర్కారును ప్రభుత్వ ఖజానా వెక్కిరిస్తున్నది. గద్దెదిగిన బీఆర్‌ఎస్, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖాళీ గల్లాను అందించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.05 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పోటాపోటీగా మ్యానిఫెస్టోలు ప్రకట ించాయి. హామీల మీద హామీలు గుప్పించాయి. అయితే అనూహ్యంగా అధికారపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థికపరమైన అంశాల్లో చుక్కలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పోలింగ్‌కు ముందు ఎన్నికల కమిషన్ రైతుబంధును నిలిపేసిన సంగతి తెలిసిందే. ఫలితాల తర్వాత పదిరోజుల్లో రైతుబంధు నిధులను నేరుగా ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆర్థికశాఖ వ్యవహా రాలు ఏమాత్రం అందుకు అనుకూలంగా లేవనే వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సర్కారీ ఖజానా ఖాళీ అయిందనే ప్రచారం సచివాల యంలో జరుగుతున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండు విడతలుగా రైతుబంధు నిధులు విడుదలయ్యేవి.
ప్రతి ఆరునెలలకు 70 లక్షల మంది రైతులకు రూ.7500 కోట్ల చొప్పున ఏడాదిలో రెండుసార్లు పెట్టుబడిసొ మ్ము కింద రూ. 15,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చేది. వానాకాలం, ఎండాకాలం సీజన్లల్లో రైతులకు ఆయా పంటల సాగు కోసం పెట్టుబడి కింద ఈ సొమ్ముని అందజే సేవారు. గత కేసీఆర్ సర్కారు రైతులకు మాత్రమే ఈ సొమ్ము ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, కౌలు రైతులు , రైతు కూలీలకు సైతం రైతుబంధును వర్తింపజేస్తామని ఎన్నికల ముందు హామీఇచ్చింది. అయితే కాంగ్రెస్ సర్కారు 10 నుంచి 15 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధును వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. స్లాబు ను తగ్గించడం ద్వారా ఏడాదికి అయ్యే ఖర్చులో నుంచి సుమారు రూ. 7000 కోట్లు మిగిలే అవకాశ ం ఉన్నట్టు అధికారులు అంటున్నారు. వీటిని ఇతర పథకాలను సర్దుబాటు చేయడానికి వీలుంటుందనే భావనలో వారున్నారు. అయితే దీనిపై అధికారికం గా ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. దీంతో పథకం అమలు ఆలస్యమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
మంత్రివర్గ విస్తరణ తర్వాత రైతుబంధుపై దృష్టిపెట్టే అవకాశముంది. మొత్తం ప్రక్రియ అంతా పూర్తిచేసి నిధులు విడుదలయ్యే నాటికి జనవరి రెండో వారం దాటనుందని తెలిసింది. నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ అధికారులు చర్చోపచర్చలు చేస్తున్నారు.