– మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన కమలం పార్టీతో జతకట్టటం ఖాయమని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్ తదితరులతో కలిసి సుమన్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీని, రేవంత్ పెద్దన్నగా సంబోధించిన తర్వాత వారి బంధం మరింతగా బలపడిందని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్… తెలంగాణలో ఒక ఏక్‌నాథ్ షిండే, హిమాంత్ బిశ్వశర్మ అవుతారంటూ విమర్శించారు. అందుకే బీజేపీ సీఎంలకు మోడీ దగ్గర దొరకని ప్రాధాన్యత… రేవంత్‌కు దొరుకుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం సీఎం పోకడలను గమనించి, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.