కర్నాటక ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కర్నాటక రాష్ట్ర ఎన్నికలకు బుధవారం 40 మంది అగ్రనేతలను స్టార్‌ క్యాంపెనర్లుగా ఏఐసీసీ ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకగాంధీ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీపీసీసీ చీఫ్‌ ఎనుముల రేవంత్‌రెడ్డికి అవకాశం దక్కింది. రాష్ట్రం నుంచి ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించింది.
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు
చేవెళ్ల, వర్థన్నపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ స్థానిక నేతలు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలం, టంగటూరు, వర్థన్నపేట హసన్‌పర్తికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు.
రాహుల్‌ది చారిత్రాత్మక నిర్ణయం :వీహెచ్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీసీ గణన చేపడతామంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.