రేవంత్‌ రెడ్డికి భయపడేది లేదు

– కాంగ్రెస్‌ హామీలపై ప్రశ్నించిన వ్యక్తిని మహబూబ్‌నగర్‌లో సీఐ కొట్టిన ఘటనపై సీరియస్‌
– బాధితునికి ఫోన్‌ చేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం వాట్సాప్‌లో ప్రశ్నించినందుకు భాస్కర్‌ ముదిరాజ్‌ అనే వ్యక్తిని మహబూబ్‌నగర్‌ సీఐ అప్పయ్య బెల్ట్‌తో కొట్టిన ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్‌కు ఫోన్‌ చేసిన జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయ పరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్‌, హ్యుమన్‌ రైట్స్‌ కమిషన్‌కు కూడా వెళ్తామన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని…పార్టీ మొత్తం భాస్కర్‌కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి అడిగిన వారిని ఇలా పోలీసులతో కొట్టించటం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.