కేసీఆర్‌ మీద కోపంతో అంబేద్కర్‌ను అవమానించిన రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ మీద కోపంతో అంబేద్కర్‌ను అవమానించిన రేవంత్‌రెడ్డి– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టామనీ, పక్కనే 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని నిలబెట్టుకున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ మీద కోపంతోనే అంబేద్కర్‌ పెద్ద విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులర్పించలేదని అన్నారు. ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు వెళ్లకుండా స్మృతి వనానికి తాళాలు వేశారని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను అనాథను చేశారని విమర్శించారు. కేసీఆర్‌ పెట్టారన్న అక్కసుతో ఇలా వ్యవహరిస్తారా?అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కట్టిన వాటిపట్ల వ్యతిరేకత ఉంటే సచివాలయంలో కూర్చోవడం మానేయాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ నుంచి తాగునీరు ఇవ్వకుండా మరో వ్యవస్థతో ఇవ్వాలని కోరారు. అనాది నుంచి కాంగ్రెస్‌కు అంబేద్కర్‌ మీద గౌరవం లేదన్నారు. ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్‌ ఓడించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని చెప్పారు. వీపీ సింగ్‌ హయాంలో భారతరత్న ప్రకటించారని అన్నారు. అంబేద్కర్‌ను అవమానించడమంటే రాజ్యాంగాన్ని, పౌరులను అవమానించడమేనని చెప్పారు. కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాలనను గాలికొదిలేసి కాంగ్రెస్‌ నేతలు కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తారా? లేదా? స్పష్టం చేయాలని కోరారు. పంటలు ఎండుతుంటే ఐపీఎల్‌ మ్యాచులకు వెళ్తారా?అని ప్రశ్నించారు.