రేవంత్‌రెడ్డి రాజకీయ సమర్థుడు

రేవంత్‌రెడ్డి రాజకీయ సమర్థుడు– బీజేపీలోకి వస్తే ఫ్రెండ్‌గా స్వాగతిస్తా
– కాంగ్రెస్‌లోనే ఉంటే అసమర్థుడైపోతాడు
– పార్టీలో ఫస్ట్‌ప్లేస్‌ ఇస్తారా? లేదా? అనేది పెద్దల ఇష్టం : చిట్‌చాట్‌లో బీజేపీ ఎంపీ డి.అర్వింద్‌కుమార్‌ హాట్‌ కామెంట్స్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలు మారినా ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయంగా ఎదిగిన సమర్థుడని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదనీ, ఇంకా 15 ఏండ్ల రాజకీయ జీవితమున్న ఆయన ఆ పార్టీలో ఉంటే అసమర్థుడైపోతాడని అన్నారు. ఆయన బీజేపీలోకి వస్తే ఒక ఫ్రెండ్‌గా స్వాగతిస్తానని చెప్పారు. తమ పార్టీలోకొస్తే ఫస్ట్‌ ప్లేస్‌ ఇస్తారా? లేదా? అనేది పార్టీ పెద్దల చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈసారి కవిత బరిలో లేకపోవడంతో నిజామాబాద్‌లో లిక్కర్‌ ఫ్రీ ఎన్నికలు జరుగుతాయంటూ వ్యాఖ్యానించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ పెద్దలు రైతు బంధు డబ్బులను తమ కోసం తరలించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై క్లారిటీ లేదనీ, రేవంత్‌రెడ్డి చేద్దామన్నా అక్కడ బడ్జెట్‌ లేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ లాగానే.. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను పచ్చిగా మోసం చేసిందని విమర్శించారు. వడ్లను రైతులెవ్వరూ అమ్ముకోవద్దనీ, తాను వచ్చాక రూ.500 బోనస్‌ ఇస్తానని రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులకు బోనస్‌ ఇవ్వడానికి ఇంకా డిసెంబర్‌ 9 రాలేదా? అని ప్రశ్నించారు. వరి ధాన్యాన్ని కూడా సరిగా కొనడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలతో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదనీ, పనికిమాలినోళ్లకు టికెట్లు ఇచ్చారని దెప్పిపొడిచారు. దేశంలో కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా దాటవన్నారు. ట్యాపింగ్‌ విషయంలో తప్పు చేస్తే జైళ్లో వేయాలిగానీ రోజుకోఅంశంపై మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఆప్‌కీ అదాలత్‌ను రెండు దశాబ్దాలుగా చూస్తున్నాననీ, రేవంత్‌రెడ్డి షో బాలీవుడ్‌ కమెడీయన్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌ షోలాగా అనిపించిందని ఎద్దేవా చేశారు. సుపారీ గురించి అడగ్గా…పొద్దున ఒక ల్యాండ్‌ గురించి మాట్లాడి సాయంత్రం సెటిల్‌మెంట్‌ చేసుకోవడమే సుపారీనా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాంటి సెటిల్‌మెంట్లు రేవంత్‌రెడ్డికి బాగా తెలుసునని చెప్పారు. భవిష్యత్తు లేని కాంగ్రెస్‌లోకి తాను పోతానని కేటీఆర్‌కు ఎలా అనిపించిందోనన్నారు. ఏం చెప్పాలో అర్థంకాక నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి ఆజాదీ అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు.
బీజేపీకి రెండు సీట్లు మాత్రమే వస్తాయని రేవంత్‌రెడ్డి చెప్పకుంటే ఆయన జాబ్‌ పోతుందనీ, అందుకే అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బిడ్డ దగ్గరకు ఈడీ వచ్చిందని.. ప్రతి దగ్గరికీ ఈడి పోదని అన్నారు. తాను పసుపు మార్కెట్‌ పెంచితే.. పదేండ్లలో మీరు డ్రగ్స్‌ మార్కెట్‌ పెంచారా? అంటూ కేటీఆర్‌కు చురకలు అంటించారు. దేశవ్యాప్తంగా మూతపడిన 66 షుగర్‌ ఫ్యాక్టరీలను బీజేపీ తెరిపించిందనీ, అవన్నీ లాభాల్లో ఉన్నాయని చెప్పారు. కేసీఆర్‌కు బిడ్డమీద ఉన్న ప్రేమ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపై ఉంటే అది ఎప్పుడో తెరుచుకునేదన్నారు.